ఏపీలో మిర్చి రైతులను ఆదుకునేందుకు చర్యలు: రామ్మోహన్‌నాయుడు
రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ మంత్రిని కోరినట్లు రామ్మోహన్ నాయుడు చెప్పారు.
By Knakam Karthik
ఏపీలో మిర్చి రైతులను ఆదుకునేందుకు చర్యలు: రామ్మోహన్‌నాయుడు
ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే రైతులకు చేయూతను ఇచ్చేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ శుక్రవారం ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి మిర్చి ఎగుమతికి ఉన్న అవకాశాలపైనా మీటింగ్‌లో చర్చించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఈ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లు పాల్గొన్నారు. అనంతరం రామ్మోహన్ నాయుడు విలేకరులతో మాట్లాడుతూ మిర్చి రైతులకు క్వింటాకు రూ.11,600, అంతకంటే ఎక్కువే మద్దతు ధర ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మద్దతు ధర ఇచ్చే అంశంపై చర్చించినట్లు చెప్పారు.
రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ మంత్రిని కోరినట్లు రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఐకార్ ద్వారా రైతులను ఆర్థికంగా భరోసా ఇవ్వాలని, గతంలో జరిగినట్లు ఇప్పుడు మిర్చి ఎగుమతులు జరగడంలేదని చెప్పారు. అయితే దానికి కొన్ని అంతర్జాతీయ సమస్యలు ఉన్నాయన్నారు. మిర్చి ఎగుమతులను తిరిగి ఎలా ప్రోత్సహించాలి అనేది చర్చించినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్రంలో మిర్చి ఎగుమతి దారులతో సమావేశం ఏర్పాటు చేసి సరైన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు.