ఇంటికి తాళం వేసి డ్యూటీకెళ్లిన కానిస్టేబుల్.. సూసైడ్ నోట్ రాసి భార్య ఆత్మహత్య
Married Woman Commits Suicide In Vijayawada. విజయవాడలో కానిస్టేబుల్ భార్య అనుమానాస్పద స్థితిలో మరణించింది. సూసైడ్ లేఖ
By Medi Samrat Published on 14 Feb 2021 10:12 AM ISTవిజయవాడలో కానిస్టేబుల్ భార్య అనుమానాస్పద స్థితిలో మరణించింది. సూసైడ్ లేఖ రాసి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. తనకు పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయని.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ లేఖలో ఉంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విజయనగరం జిల్లా గరివిడి మండలానికి చెందిన మీసాల కృష్ణారావుకు శ్రీకాకుళం జిల్లా జి. సిగడాం మండలం పీఆర్ వలస గ్రామానికి చెందిన మీసాల రజిని (23)కి 2015లో వివాహమైంది. కృష్ణారావు ప్రస్తుతం ఏఆర్ కానిస్టేబుల్ గా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఐఎడబ్ల్యూ వింగ్ లో పని చేస్తున్నారు.
దీంతో ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ విజయవాడ నగర సమీపంలోని గొల్లపూడి మౌలానగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి 15 నెలల కుమారుడు ఉన్నాడు. ఈ నెల 11వ తేదీ గురువారం రాత్రి రజినీ ఇంట్లొ ఉండగా.. భర్త కృష్ణారావు బయట తాళం వేసి విధులకు వెళ్లారు. శుక్రవారం ఉదయం ఏడు గంటలకు రజిని.. భర్త కృష్ణారావుకు ఫోన్ చేసి టిఫిన్ తీసుకురమ్మని చెప్పింది. కృష్ణారావు టిఫిన్ తీసుకొని ఉదయం 8.50 గంటలకు ఇంటికి వెళ్లి తాళం తీసి చూడగా.. భార్య బెడ్ రూమ్ లో ఫ్యాన్‌కి చున్నీతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది.
దీంతో కంగారుపడ్డ కృష్ణారావు.. ఈ విషయాన్ని భవానీపురం పోలీసులకు చెప్పారు. వెంటనే పోలీసులు వచ్చి పరిశీలించారు. రజనీ డైరీని, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గదిలో ఆత్మహత్య లేఖ కూడా పోలీసులకు లభ్యమైంది. ఆ సూసైడ్ నోట్లో తన భర్త మంచివాడని, తనకు పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయని రాసి ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇంటి బయట తాళం ఎందుకు వేశావని కానిస్టేబుల్ క్రిష్ణారావును పోలీసులు ప్రశ్నించగా.. తాను ఏ సమయంలో ఇంటికి వస్తానో తెలియదని.. భార్యను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే వేస్తున్నట్లు చెప్పినట్లుగా పోలీసులు తెలిపారు. దంపతుల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా.. ? లేఖలోని అక్షరాలు రజినీవేనా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.