మోసాలకు పాల్పడ్డారన్న ఏపీ సీఐడీ.. వెంటనే స్పందించిన మార్గదర్శి
Margadarsi chit fund scam AP CID notice subscribers rs 1 crore cash deposits. మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (MCFPL)కి సంబంధించిన ఆర్థిక మోసంపై కొనసాగుతున్న విచారణలో
By న్యూస్‌మీటర్ తెలుగు
మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (MCFPL)కి సంబంధించిన ఆర్థిక మోసంపై కొనసాగుతున్న విచారణలో మార్గదర్శకాలను ఉల్లంఘించి, పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేసిన వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (APCID). కోటి రూపాయలకు పైగా చిట్ గ్రూపుల్లో నగదు డిపాజిట్ చేసిన చందాదారులపై సిఐడి ప్రత్యేకంగా లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ సీఐడీ ప్రకటనలో పేర్కొంది. నోటీసులు అందుకున్న చందాదారులందరూ విచారణకు సహకరించాలని ఏపీ సీఐడీ కోరింది. మార్గదర్శి లో రూ. కోటి పైన నగదు డిపాజిట్ చేసిన ఖాతాదారులకు నోటీసులు జారీ చేసినట్లు ఒక ప్రెస్‌నోట్‌లో తెలిపింది. మార్గదర్శి కేసు దర్యాప్తులో భాగంగా కోటి రూపాయలకు పైగా నగదు రూపంలో చందాలు కట్టిన చందాదారులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు సీఐడీ ఓ ప్రకటన విడుదల చేసింది. రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నిబంధనల్ని ఉల్లంఘించి కోటి రూపాయలకు మించి నగదుతో చిట్స్ వేసిన వారికి నోటీసులు జారీ చేస్తున్నట్లు సీఐడీ తెలిపింది.
నోటీసులు అందుకున్న చందాదారులందరూ విచారణకు సహకరించాలని ఏపీ సీఐడీ కోరింది. “ఖచ్చితమైన, సమయానుకూల సమాచారాన్ని అందించడం ద్వారా, సత్యాన్ని వెలికితీసేందుకు, దోషులను న్యాయస్థానానికి తీసుకురావడంలో చందాదారులు అధికారులకు సహాయపడగలరు. MCFPL ప్రమేయం ఉన్న ఆర్థిక మోసంపై దర్యాప్తు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. సమగ్రమైన, నిష్పాక్షికమైన విచారణ జరిగేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం" అని సీఐడీ తెలిపింది. ఆర్థిక నేరాల, మనీ లాండరింగ్ నివారణకు RBI, CBDT తీసుకొచ్చిన నిబంధనల మేరకే ఈ నోటీసులు జారీ చేసినట్లు ఏపీ సీఐడీ స్పష్టం చేసింది.
ఈ నోటీసుకు వెంటనే మార్గదర్శి స్పందించింది. ఆదాయపు పన్ను చట్టంలోని ఏ నిబంధనలను, భారతీయ రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలను మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ ఎక్కడా ఉల్లంఘించలేదని సంస్థ తాజాగా ప్రకటనలో స్పష్టం చేసింది. మా చందాదారులందరికీ ఈ మేరకు హామీ కూడా ఇస్తున్నామని.. చిట్ ఫండ్ వ్యాపారం కోసం నిర్దేశించిన రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్‌కు అనుగుణంగా కంపెనీ తన వ్యాపారాన్ని చాలా నిబద్దతతో నిర్వహిస్తోందని ప్రకటనలో తెలిపింది. మా ఆర్థిక క్రమశిక్షణే మా బలమనీ, మేము ఎప్పుడైనా ఏ విషయంలోనూ చందాదారుల నమ్మకాన్ని వమ్ము చేసేలా చిట్ ఫండ్ నిబంధనలను ఉల్లంఘించలేదనీ తెలిపింది. మా చందాదారులందరినీ భయాందోళనలకు గురిచేయడానికి, వారి వ్యక్తిగత వివరాల కోసం పట్టుబట్టి వేధించడానికి, మార్గదర్శి వ్యాపారాన్ని దాని కస్టమర్ నెట్‌వర్క్‌ను దెబ్బతీసే దురుద్దేశాలతో AP-CID విచారణలను కొనసాగిస్తోందని సంస్థ ఆరోపించింది. కంపెనీలో చందాదారునిగా ధృవీకరించిన తర్వాత కూడా తెలంగాణ హైకోర్టు రిట్ పిటీషన్ WP 45189/2022లో జారీ చేసిన ఉత్తర్వులో చందాదారుల గోప్యతలో జోక్యం చేసుకోకూడదని AP-CID కి సూచించిన విషయాన్ని గుర్తు చేసింది. చందాదారుల గోప్యత విషయంలో కోర్టు ఉత్తర్వును విస్మరించి AP-CID కోర్టు ధిక్కారానికి పాల్పడిందని పేర్కొంది. ఈ విషయంలో కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, AP-CID మార్గదర్శి సంస్థను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా పదే పదే ప్రెస్ నోట్స్ విడుదల చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన కస్టమర్లందరినీ వేధింపులకు గురిచేస్తుందని తెలిపింది.