మావోయిస్ట్ అగ్రనేత చలపతి హతం.. త‌ల‌పై రూ. కోటి రివార్డ్.. ఆయ‌న స్వ‌స్థలం ఎక్క‌డంటే..

ఛత్తీస్‌గఢ్ అడవుల్లో గత రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో చలపతితో పాటు మ‌రో 19 మంది మావోయిస్టులు చనిపోయారు.

By Medi Samrat
Published on : 21 Jan 2025 3:30 PM IST

మావోయిస్ట్ అగ్రనేత చలపతి హతం.. త‌ల‌పై రూ. కోటి రివార్డ్.. ఆయ‌న స్వ‌స్థలం ఎక్క‌డంటే..

ఛత్తీస్‌గఢ్ అడవుల్లో గత రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో చలపతితో పాటు మ‌రో 19 మంది మావోయిస్టులు చనిపోయారు. నక్సలైట్లపై భద్రతా బలగాలు జరుపుతున్న ఆపరేషన్‌లో ఇది పెద్ద విజయంగా భావిస్తున్నారు. చలపతి అస‌లు పేరు జయరాంరెడ్డి కాగా.. అత‌డిని రామచంద్రారెడ్డి, అప్పారావు, రాము అనే మారు పేర్లతో పిలుస్తారు. కానీ అతడు చలపతిగా అత్యంత ప్రసిద్ధ చెందాడు. చలపతి మావోయిస్టు శ్రేణుల్లో సీనియర్ నాయకుడు.

చలపతి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు నివాసి. ఆయ‌న‌ 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. త‌క్కువ‌ విద్యార్హత ఉన్నప్పటికీ, అతడు మావోయిస్టు శ్రేణులలో ప్రముఖ నేత‌గా ఎదిగాడు. సంస్థ కార్యకలాపాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. కోటి రూపాయల రివార్డు కూడా ఆయ‌న త‌ల‌పై ఉంది. రివార్డ్ అమౌంట్‌లోనే అతడు భద్రతా దళాలకు ఎంత ముఖ్యమైన టార్గెట్‌గా ఉన్నాడో తెలుస్తుంది. ఆయ‌న వ‌య‌సు దాదాపు 60 ఏళ్లు ఉంటుంది.

చలపతికి బస్తర్‌లోని దట్టమైన అడవుల గురించి పూర్తిగా తెలుసు. అతడి భద్రతా బృందంలో 8 నుండి 10 మంది వ్యక్తిగత గార్డులు ఉన్నారంటే.. ఆయ‌న‌ నక్సలైట్ నెట్‌వర్క్‌లో ఎంత ముఖ్యమైన పదవిని నిర్వహించాడో అంచనా వేయవచ్చు.

AK-47, SLR రైఫిల్ వంటి అధునాతన ఆయుధాలను కలిగి ఉన్న చలపతి.. వ్యూహాలను రూపొందించడంలో, కార్యకలాపాలకు నాయకత్వం వహించడంలో కీలక పాత్ర పోషించిన ఫ్రంట్‌లైన్ నాయకుడు. సవాలుతో కూడిన ప్రాంతాలలో వనరులను సమీకరించగల సామర్థ్యం, అతని నాయకత్వం కారణంగా అతడు మావోయిస్టుల కీల‌క నేత‌గా ఎదిగాడు.

డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కోబ్రా కమాండో, ఒడిశాకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ జాయింట్ టీమ్ ఎన్‌కౌంటర్‌లో చలపతి, అతని సహచరులు మరణించారు. ఒడిశా సరిహద్దుకు 5 కిలోమీటర్ల దూరంలో ఛత్తీస్‌గఢ్‌లోని కులారిఘాట్ రిజర్వ్ ఫారెస్ట్‌లో కొందరు మావోయిస్టులు దాక్కున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఘటనా స్థలంలో సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ సహా తుపాకులు, మందుగుండు సామాగ్రి, బాంబులు లభ్యమయ్యాయి.

అమిత్ షా సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో ఇలా రాశారు, 'నక్సలిజంపై మరో బలమైన దాడి. నక్సల్స్ రహిత భారతదేశాన్ని నిర్మించడంలో మన భద్రతా దళాలు గొప్ప విజయాన్ని సాధించాయి. ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో సిఆర్‌పిఎఫ్, ఎస్‌ఓజి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో 14 మంది నక్సలైట్లను హతమార్చారు. నక్సల్స్ రహిత భారతదేశం కోసం మన సంకల్పం, మన భద్రతా దళాల సంయుక్త కృషితో.. నక్సలిజం ఈ రోజు తన చివరి శ్వాసను తీసుకుంటోందని ట్వీట్ చేశారు.

Next Story