కాంగ్రెస్‌లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

మంగళగిరి ఎమ్మెల్యే, వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

By Medi Samrat  Published on  21 Jan 2024 2:40 PM GMT
కాంగ్రెస్‌లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

మంగళగిరి ఎమ్మెల్యే, వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన కొద్దిసేపటికే ఎమ్మెల్యే ఆర్కే కాంగ్రెస్‌లో చేరడం గమనార్హం. ఆర్కేకు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్ షర్మిలతోనే తన ప్రయాణమని కొద్ది రోజుల కిందటే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ గూటికి వెళ్లే మొదటి ఎమ్మెల్యేను తానేనని ఆయన వెల్లడించారు. చెప్పినట్లుగానే ఆర్కే ఆదివారం హస్తం గూటికి చేరుకున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో పోటీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, షర్మిల, ఆధిష్ఠానం సూచనల మేరకు నడుచుకుంటానని ఆయన స్పష్టం చేశారు. షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్‌లో చేరుతున్నానని, ఆమెతో పాటు రాజకీయాల్లో కొనసాగుతానని వెల్లడించారు.

Next Story