ఆ ఏరియాలో ఎవరి ఇంట్లోనైనా పాము కనిపించింది అంటే చాలు అతడినే పిలుస్తారు. అతడు కూడా క్షణాల్లో అక్కడికి చేరుకుంటాడు. పామును ఒడుపుగా పట్టుకుని వాటిని దూరంగా వదిలివేస్తుంటాడు. పాములను పట్టడంలో నేర్పరి అయిన అతడు పాము కాటుకు బలయ్యాడు. చిన్నపాటి ఏమరపాటు వలన తన ప్రాణాలనే పొగొట్టుకున్నాడు. పాము చనిపోయిందని చేతితో పట్టుకుని పరిశీలిస్తుండగా అది కాటేసింది. ఫలితంగా అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాలపల్లిలో చోటుచేసుకుంది.
మాలపల్లి గ్రామంలోని పాఠశాల వద్ద శుక్రవారం పాము కనిపించడంతో జనం వెంటనే పాములు పట్టే రంగస్వామికి సమాచారం అందించారు. అతడు వెంటనే అక్కడికి చేరుకున్నాడు. పామును కర్రతో కొట్టాడు. ఈ క్రమంలో అది చనిపోయిందనుకుని చేతితో పామును పరిశీలిస్తున్నాడు. ఇంతలో పాము కాటువేసింది. వెంటనే స్పందించిన స్థానికులు అతడిని ఆదోని ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో మాలపల్లిలో విషాదం నెలకొంది. చిన్నపాటి పొరపాటు అతడి ప్రాణాలనే తీసిందని గ్రామస్తులు చెబుతున్నారు.