ఈసీజీ పేరుతో ల్యాబ్‌లో యువతి చేత బట్టలను బలవంతంగా తీయించి సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసిన వ్యక్తిని కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన ఓ యువతి అనారోగ్యం కారణంగా ఈసీజీ తీయించుకునేందుకు వచ్చింది. అక్కడే ఉన్న హరీష్ యువతి తల్లిదండ్రులను గది బయట ఉంచి ఆమెను లోపలికి తీసుకెళ్లాడు. ఈసీజీ తీస్తానంటూ వస్త్రాలను తొలగించాలని యువతికి చెప్పాడు. ఆమె అందుకు అడ్డు చెప్పింది. వస్త్రాలు తీయకపోతే ఈసీజీ సరిగా తీయలేమని, సమస్య ఏమిటో రిపోర్టులో సరిగ్గా రావాలంటే వస్త్రాలు తీయాలని ఒత్తిడికి గురి చేశాడు. త్వరగా తీయించుకుంటావా లేదా.. బయట చాలా మంది ఉన్నారు అంటూ హడావిడి చేశాడు.
ఆ యువతి చేత బలవంతంగా వస్త్రాలన్నింటినీ తొలగించేలా చేశాడు. ఆ తర్వాత యువతిని కళ్లు మూసుకోవాలని చెప్పి తన ఫోన్‌లో యువతిని నగ్నంగా చిత్రీకరిస్తుండగా గమనించిన వెంటనే ప్రతిఘటించింది. వెంటనే ఈసీజీ రూమ్ నుండి బయటి వచ్చి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు ఏడ్చుకుంటూ చెప్పింది.. ఆగ్రహానికి గురైన తండ్రి అతడిని నిలదీశాడు. అయినా తానేం అలా ప్రవర్తించలేదని హరీష్ బుకాయించాడు. ఫోన్ ఇవ్వాలని అడిగితే ఎదురుతిరగడంతో.. యువతి తండ్రి పోలీసులకు జరిగిన విషయాన్ని ఫిర్యాదు చేశాడు. అవుట్‌పోస్ట్ పోలీసులు వచ్చి హరీష్‌ను పట్టుకున్నారు.