తెలుగుదేశం పార్టీ ప్రతీ ఏటా ఘనంగా నిర్వహించే మహానాడును ఈ సారి రాజమండ్రి వేదికగా మే27, 28 తేదీల్లో నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది మూడు రోజులు నిర్వహించే మహానాడును ఈ సారి రెండు రోజులకే పరిమితం కానున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రెండోరోజున మహానాడు అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభకు జనం భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్లు స్థలాన్ని ఎంపిక చేయనున్నారు. ఈ బాధ్యతను టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి అధిష్టానం అప్పగించింది. వేమగిరి గ్రామ పరిధిలో జాతీయ రహదారిని ఆనుకుని సుమారు 38ఎకరాల ఖాళీ స్థలాన్ని గుర్తించారు. ఇక్కడే వేదిక, భోజన వసతి, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడే మరో వందెకరాల స్థలం అందుబాటులో ఉంది. ఇక్కడ వాహనాల పార్కింగ్ సదుపాయం కల్పించనున్నారు. రాజమండ్రి వేదికపై నుంచే రానున్న ఎన్నికలకు మేనిఫెస్టోను రూపొందించనున్నట్లు తెలుస్తోంది.