నేడే అల్పపీడనం.. ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు
బంగాళాఖాతంలో కోస్తాంధ్రకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఇవాళ అల్పపీడనంగా మారనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి Published on 5 Sept 2024 8:22 AM ISTనేడే అల్పపీడనం.. ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు
బంగాళాఖాతంలో కోస్తాంధ్రకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఇవాళ అల్పపీడనంగా మారనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు రాష్ట్రంపై రుతుపవన ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వివరించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
అటు వరదతో అల్లాడిపోతున్న విజయవాడను వర్షం వీడట్లేదు. అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. భారీ వర్షంతో నగరవాసులు వణికిపోతున్నారు. అలాగే కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
బంగాళాఖాతం సముద్రం మీద కొత్త వాతావరణ వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది. "సెప్టెంబర్ 5 నాటికి పశ్చిమ-మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో తాజా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది" అని ఆ ప్రకటన తెలిపింది. భారత వాతావరణ శాఖ ప్రకారం, సెప్టెంబరు 4 నుండి 8 వరకు ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని చాలా ప్రదేశాలలో, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ (SCAP)లో బుధవారం నుండి శుక్రవారం వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.