ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీ రాబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా, 89,882 మంది ధరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.1797.64కోట్ల ఆదాయం వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలోని 113 మద్యం దుకాణాలకు అత్యధికంగా 5,764 దరఖాస్తులు అందాయి. ఏపీలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు లాటరీ పద్దతిలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ చేపట్టనుంది. 15న ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగించనున్నారు. 16వ తేదీ నుండి రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానుంది.
ప్రత్యేక కేంద్రంలో ఉన్నతాధికారుల సమక్షంలో లాటరీ నిర్వహించనున్నారు. ఈ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. లాటరీ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఎంపికైన వారి వివరాలను అధికారులు వెల్లడిస్తారు. మద్యం దుకాణాలకు ఆయా ప్రాంతాల్లో జనాభాను బట్టీ లైసెన్స్ ఫీజు రూ.50, 55, 65, 85 లక్షలుగా నాలుగు శ్లాబులను ఏర్పాటు చేశారు. ఎంపికైన అభ్యర్థులు లైనెన్స్ ఫీజు 6 వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం కల్పించారు. మొదటి వాయిదాను 24 గంటల వ్యవధిలో చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజు రెండో ఏడాది 10 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను 15వ తేదీ పూర్తి చేసి షాపులను లాటరీలో ఎంపికైన వారికి అప్పగిస్తారు.