అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కుంభకోణం కేసులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. లోకేష్ న్యూఢిల్లీలో ఉన్నందున బుధవారం ఆయన తరపున లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతిలో ఇన్నర్‌రింగ్ రోడ్డు పేరుతో గత టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. ఈ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏ1 కాగా.. మాజీ మంత్రి పి.నారాయణ ఏ2, లోకేష్ A 14 నిందితులుగా ఉన్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చి లబ్ధి పొందేందుకు లోకేష్ ప్రయత్నించారని, ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు ఇప్పించుకోవడంలో కీలక పాత్ర పోషించారని సీఐడీ ఆరోపించింది. ఈ కేసులో రియల్టర్లు లింగమనేని రమేష్, రాజశేఖర్, హెరిటేజ్ ఫుడ్స్‌ను కూడా నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే నారాయణకు ముందస్తు బెయిల్ లభించగా, అదే రిలీఫ్ కోసం లోకేశ్ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు.