ఐటీ శాఖ మంత్రిగా సమర్ధవంతంగా పనిచేస్తా: నారా లోకేష్
గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో తాను నేర్చుకున్న పాఠాలతో మరింత బాధ్యతాయుతంగా, సమర్ధవంతంగా పని చేస్తానన్న నమ్మకం ఉంది అని లోకేష్ తెలిపారు.
By అంజి Published on 15 Jun 2024 1:06 AM GMTఐటీ శాఖ మంత్రిగా సమర్ధవంతంగా పనిచేస్తా: నారా లోకేష్
అమరావతి: తనకు రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్‌టీజీ) శాఖలతో పాటు మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖలను కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్ అత్యంత బాధ్యతతో పనిచేసేందుకు ముఖ్యమంత్రి తనకు మంచి అవకాశం కల్పించారని పేర్కొన్నారు.
గత టీడీపీ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామీణ ప్రాంతాల ప్రొఫైల్‌ను పూర్తిగా మార్చే అవకాశం కల్పించారని, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా కూడా రాష్ట్రానికి పలు కంపెనీలను ఆహ్వానించి ఏర్పాటు చేయగలిగామన్నారు. కంపెనీల యూనిట్లు ఇక్కడ ఉన్నాయి, తద్వారా యువతకు ఉపాధి కల్పిస్తున్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో తాను నేర్చుకున్న పాఠాలతో మరింత బాధ్యతాయుతంగా, సమర్ధవంతంగా పని చేస్తానన్న నమ్మకం ఉంది అని లోకేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
కేజీ నుంచి పీజీ వరకు విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకువస్తామని యువ గళం పాదయాత్రలో ప్రజలకు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొడక్ట్‌గా, గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం తన వంతు బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలను తమ యూనిట్ల ఏర్పాటుకు ఆహ్వానించడం ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. జూన్ 12న తనతో పాటు ప్రమాణస్వీకారం చేసిన మొత్తం 24 మంది మంత్రులకు చంద్రబాబు నాయుడు శుక్రవారం శాఖలను కేటాయించారు.