దరఖాస్తుల ద్వారానే రూ.1800 కోట్ల అర్జన.. నెక్స్ట్ టార్గెట్ అదే
ఆంధ్రప్రదేశ్ లోని 3,396 మద్యం అవుట్‌లెట్‌లకు సంబంధించి నాన్-రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు కింద రూ. 1,800 కోట్లు ప్రభుత్వం ఆర్జించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Oct 2024 9:50 PM ISTఆంధ్రప్రదేశ్ లోని 3,396 మద్యం అవుట్‌లెట్‌లకు సంబంధించి నాన్-రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు కింద రూ. 1,800 కోట్లు ప్రభుత్వం ఆర్జించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిగిలిన ఆర్థిక సంవత్సరంలో లైసెన్సింగ్ ఫీజులు, మద్యం విక్రయాల ద్వారా సుమారు రూ. 20,000 కోట్లను అంచనా వేస్తోంది. “ఒకసారి లాటరీ ప్రాతిపదికన అవుట్‌లెట్‌ను కేటాయించిన తర్వాత, విజేతలు ఆరు వాయిదాలలో రూ. 50 లక్షల నుండి రూ. 85 లక్షల వరకు లైసెన్సింగ్ ఫీజులను చెల్లించాలి. గతేడాది మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లు వచ్చాయి. ఈ ఏడాది మిగిలిన ఆరు నెలల కాలానికి ప్రభుత్వం రూ. 17,000 కోట్లకుపైగా అంచనా వేస్తోంది” అని ఒక మూలం పిటిఐకి తెలిపింది.
3,396 ప్రైవేట్ మద్యం దుకాణాలకు 90,000 దరఖాస్తులు
రెవెన్యూ (ఎక్సైజ్) ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 3,396 ప్రైవేట్ మద్యం దుకాణాలకు దాదాపు 90,000 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రూ. 2 లక్షల నాన్-రిఫండబుల్ అప్లికేషన్ రుసుముతో ఖజానాకు సుమారు రూ.1,800 కోట్లు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,396 దుకాణాలకు మొత్తం 89,882 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అత్యధికంగా ఎన్టీఆర్ విజయవాడలో 5,825, పశ్చిమగోదావరిలో 5,628, ఏలూరులో 5,499, విజయనగరంలో 5,241, అత్యల్పంగా ఏఎస్‌ఆర్ జిల్లా 1205, పార్వతీపురం మన్యంలో 1,393, శ్రీ సత్యసాయి జిల్లాలో 1,393 మంది బిడ్లు దాఖలయ్యాయి.
లైసెన్సుల కేటాయింపునకు సంబంధించి లాటరీ ప్రక్రియ
మంగళవారం మొత్తం 26 జిల్లాల్లో ఆయా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రైవేట్ షాపుల ద్వారా మద్యం విక్రయాల లైసెన్స్‌ల కేటాయింపునకు లాటరీ డ్రాయింగ్ ప్రక్రియ పూర్తీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు విడతలుగా మద్యం దుకాణాల నుంచి ఏటా 2,084 కోట్ల రూపాయలను లైసెన్సింగ్ ఫీజుగా పొందనుంది. మద్యం షాపుల లైసెన్స్‌దారులందరి నుంచి తొలి విడత మొత్తం రూ.335 కోట్లు మంగళవారం నాటికి అందుతాయి.YSRCP హయాంలో నగదు రూపంలో మాత్రమే మద్యం దుకాణాల దగ్గర కొనడానికి అవకాశం ఉండేది. కొత్త ప్రభుత్వ హయాంలో నగదు, UPI, ఇతర చెల్లింపు విధానాలన్నీ మద్యం దుకాణాల వద్ద అనుమతించనున్నారు.ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ గత నెలలో ప్రభుత్వ యాజమాన్యంలోని రిటైల్ అవుట్‌లెట్లతో కూడిన పాత ఎక్సైజ్ పాలసీని రద్దు చేసింది. బార్‌లు కాకుండా ప్రైవేట్ అవుట్‌లెట్‌లు మద్యాన్ని విక్రయించడానికి అనుమతించే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.రాష్ట్రవ్యాప్తంగా 3,396 ఔట్‌లెట్ల కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. లాట్ల ద్వారా దుకాణాల కేటాయింపు సోమవారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మద్యంలో కనీసం నాణ్యత లేదంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా అధిక ధరలకు అమ్మారంటూ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీ ప్రకారం 180 ఎంఎల్ మద్యం రూ.99కే చౌకగా లభించనుంది.