ఏపీ మంత్రి రోజాపై టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజాపై బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని అన్నారు. ఒక మహిళా ప్రజాప్రతినిధిపై అటువంటి వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణను అరెస్ట్ చేయాలంటూ వాసిరెడ్డి పద్మ రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. మంత్రి రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన బండారుపై కఠిన చర్యలు తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ కోరారు.
మంత్రి రోజా బ్లూ ఫిల్మ్స్‌లో నటించారంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు బండారు సత్యనారాయణ. రోజా వీడియోలు తమ దగ్గర ఉన్నాయని, వాటిని బయటపెడతామని వ్యాఖ్యలు చేశారు బండారు సత్యనారాయణ. ఈ వ్యాఖ్యలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. సాక్షాత్తు మహిళా మంత్రికే ఇంత బహిరంగంగా అవమానం జరిగితే.. ఇంకా సామాన్య మహిళల పరిస్థితేంటంటూ ప్రశ్నించారు. ఇంతకంటే అవమానం మహిళలకు మరొకటి ఉంటుందా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.