త్రివిక్రమ్‌ ట్విటర్‌ ఖాతా.. మంత్రికి అసలు విషయం చెప్పిన ప్రముఖ నిర్మాణ సంస్థ.!

Leading film production company has told the minister that Trivikram does not have a Twitter account. త్రివిక్రమ్‌ ట్విటర్‌ ఖాతా.. మంత్రికి అసలు విషయం చెప్పిన ప్రముఖ నిర్మాణ సంస్థ.!

By అంజి  Published on  27 Nov 2021 1:09 PM IST
త్రివిక్రమ్‌ ట్విటర్‌ ఖాతా.. మంత్రికి అసలు విషయం చెప్పిన ప్రముఖ నిర్మాణ సంస్థ.!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల సినిమాటోగ్రపీ చట్టానికి సవరణలు చేస్తూ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌తో పాటు టికెట్ల రేట్లను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. కాగా ఆన్‌లైన్‌ విధానంపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు హర్షం వ్యక్తం చేశారు. అదే టైమ్‌లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న మాదిరి టికెట్ల ధరలు నిర్ణయిస్తే బాగుంటుందని, దీనిపై పునరాలోచించాలని చిరంజీవి ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంలోనే సోషల్‌ మీడియా వేదికగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ టికెట్ల రేట్లపై స్పందించినట్లు పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ ట్వీట్‌ను త్రివిక్రమే చేశాడనుకున్న మంత్రి పేర్ని నాని.. దాని గురించి మీడియా సమావేశంలో ప్రస్తావించాడు. త్రివిక్రమ్‌ చేసిన ట్వీట్‌ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పాడు.

అయితే తాజాగా ఈ విషయమై ప్రముఖ నిర్మాణ సంస్థ స్పందించింది. "దర్శకుడు త్రివిక్రమ్‌కు ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ లేవు. ఆయన పేరు లేదా ఫొటో ఉపయోగించి వివిధ ఖాతాల్లో చేసిన కామెంట్స్‌ను నమ్మవద్దు. త్రివిక్రమ్ నుండి అఫీషియల్ స్టేట్మెంట్ ఏదైనా సరే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ & ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నుంచి మాత్రమే వస్తుంది" అని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ & ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు ట్వీట్ చేశాయి. దర్శకుడు త్రివిక్రమ్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన చెప్పే మాటాలను, డైలాగులను ఎంతో మంది సోషల్‌ మీడియాలో వివిధ ఖాతాలు సృష్టించి పోస్టు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే 'ప్రతి సినిమాకూ ఒకటే టికెట్ రేట్ అన్నట్టుగా... ప్రతి పాఠశాలలో ఒకటే రేటు, ప్రతి ఆస్పత్రిలో ఒకటే బిల్లు ఎందుకు ప్రవేశపెట్టరు? పేదలకు విద్య, వైద్యం కంటే సినిమా ఎక్కువా?' అని త్రివిక్రమ్ ట్వీట్ చేసినట్టు ఓ వార్త సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది.


Next Story