ఆంధ్రప్రదేశ్ భూమి మరియు పట్టాదార్ పాస్ బుక్స్ చట్టం, 1971 సవరణ బిల్లుకు శాసనమండలిలోనూ ఆమోదం లభించినట్లు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇక భూ వివాదాలకు సంబంధించి అప్పిటేల్ అధారిటిగా డీఆర్వో స్థానంలో ఆర్డీవో ఉండనున్నట్లు పేర్కొన్నారు. గురువారమే శాసనసభలో సవరణ బిల్లుకు ఆమోదం లభించగా.. సోమవారం శాసనమండలిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆమోదం కోసం బిల్లును ప్రవేశపెట్టారు.
గతంలోనూ అప్పిలేట్ అధారిటిగా ఆర్డీవోనే ఉండగా.. 2022లో చట్ట సవరణ చేసి డీఆర్వోను నియమించారు. అయితే డీఆర్వోలకు పనిభారం అధికంగా ఉండడంతో అప్పీళ్ల పరిష్కారం ఆలస్యమౌతుంది. ఇప్పటి వరకు పెండింగ్ లో 4 లక్షలకు పైగా దరఖాస్తులు ఉన్నాయి.. దీంతో అప్పీళ్ల పరిష్కారానికి డీఆర్వోలకు ఆరు నెలల సమయం పట్టనుంది. తాజాగా చట్ట సవరణ వల్ల ఆర్డీవోలు 3 నెలల కాలంలోనే అప్పీళ్లను పరిష్కరించనున్నారు. భౌగోళికంగా కూడా ఆర్డీవోలు ప్రజలకు దగ్గరగా ఉండనున్నారు.. డీఆర్వోల కన్నా ఆర్డీవోల వద్దకు దరఖాస్తులు తక్కువ సంఖ్యలో రానున్నాయని మంత్రి అనగాని పేర్కొన్నారు.