ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వివిధ కంపెనీలకు ప్రభుత్వం భూములు కేటాయించింది. జీఎంవో సిఫార్సుల మేరకు రాజధాని అమరావతిలో భూములు కేటాయించింది. రాజధాని అమరావతిలో బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్‌కు 70 ఎకరాలు, ఐటీ టవర్ నిర్మాణానికి ఎల్ అండ్ టీ సంస్థకు 10 ఎకరాలు, అమరావతిలో ఆస్పత్రి, మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్సు కార్పోరేషన్ కోసం 25 ఎకరాలు, హడ్కో హ్యాబిటేట్ సెంటర్ ఏర్పాటు కోసం 8 ఎకరాల భూమి కేటాయించింది.
కాగా గతంలో భూముల కోసం దరఖాస్తు చేసిన 13 సంస్థలకు కేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసింది. అమరావతిలో భవనాల నిర్మాణం కోసం భూములు అడిగిన 16 సంస్థలకు చోటు మార్పు చేస్తూ భూమి కేటాయించింది. మైస్ హబ్ కోసం ఇచ్చిన 42 ఎకరాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. భూములు కేటాయించిన సంస్థలకు భవన నిర్మాణాలు, కార్యకలాపాల కోసం నిర్దేశిత గడువు విధిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. భవన అనుమతులు, డీపీఆర్ లు సమర్పించాలని సూచించింది. అమరావతి భూ కేటాయింపుల నిబంధనలు 2017 ప్రకారమే షరతులు విధిస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.