లక్ష్మీ పార్వతి వర్సెస్ బుద్ధా వెంకన్న
Lakshmi Parvathi vs Buddha Venkanna. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలుగు సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
By Medi Samrat Published on 28 May 2023 8:15 PM ISTవైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలుగు సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ చివరి నిమిషం వరకు అండగా ఉంది దేవినేని నెహ్రూ ఒక్కడేనని... దేవినేని నెహ్రూ ఒక్కడే ఎన్టీఆర్‌కు అసలు సిసలైన వారసుడని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్‌కు తామే వారసులమంటూ చాలా మంది డబ్బాలు కొట్టుకుంటున్నారని, కడుపున పుట్టినవాళ్లే వారసులు కారని అన్నారు. చివరకు మాట్లాడడం రాని నారా లోకేశ్ కూడా తానే ఎన్టీఆర్‌కు వారసుడినంటూ చెప్పుకుని తిరుగుతున్నాడని.. వీళ్లంతా ఎన్టీఆర్‌ను మోసం చేసిన దుర్మార్గులు అని వాళ్లెలా వారసులు అవుతారని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. కడవరకు అండగా నిలిచిన వారే వారసులంటూ లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వెన్నుపోటుతో ఎన్టీఆర్ తీవ్ర ఆవేదనకు గురై మరణించారని ఆరోపించారు. విజయవాడ నడిబొడ్డున ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరగడం సంతోషం కలిగిస్తోందని లక్ష్మీపార్వతి చెప్పారు. విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు లక్ష్మీ పార్వతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
వైసీపీ నేత లక్ష్మీ పార్వతిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శలు చేశారు. ఎన్టీఆర్ జీవితంలో చీకటి రోజు లక్ష్మీ పార్వతి ప్రవేశించిన రోజే అని.. ముందు అది తెలుసుకుని ఆమె మాట్లాడితే బాగుంటుందని సూచించారు. ఎన్టీఆర్ కు తన కుమారులు, కుమార్తెలు వారసులేనన్నారు. అందుకే కొడుకు, కూతురుకు సమాన హక్కులు కల్పించారని అన్నారు. నారా భువనేశ్వరి భర్తగా, ఎన్టీఆర్ అల్లుడిగా చంద్రబాబుకు వారసత్వం ఉందన్నారు. లక్ష్మీ పార్వతి వల్లే ఆనాడు టీడీపీలో నాయకులు ఉండలేని పరిస్థితి ఏర్పడిందని.. రెండు దశాబ్దాలుగా ఎన్టీఆర్ అడుగుజాడల్లో చంద్రబాబు టీడీపీని నడిపిస్తున్నారని.. లక్ష్మీ పార్వతిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా మాట్లాడిస్తున్న వారు కూడా వాస్తవాలు తెలుసుకోవాలన్నారు.