రహస్య ప్రాంతానికి ఆనందయ్య తరలింపు..!
Krishnapatnam Anandaiah moves to a secret place.నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్యకు కరోనా మందు ఎంత
By తోట వంశీ కుమార్ Published on 29 May 2021 9:46 AM IST
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్యకు కరోనా మందు ఎంత పేరుతెచ్చి పెట్టిందో.. అన్ని చిక్కులను కూడా తెచ్చిపెట్టింది. ఈ మందుపై పూర్తి స్థాయి పరిశోధనలు చేసే వరకు పంపిణీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలిపివేసింది. అదే సమయంలో ఆయనకు భద్రత కల్పించి ఇంటి నుంచి తీసుకెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో శుక్రవారం ఆయన్ను కృష్ణపట్నం తీసుకొచ్చిన పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున మళ్లీ రహస్య ప్రాంతానికి తరలించారు.
మరో వైపు మందు కోసం కృష్ణపట్నానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ప్రస్తుతం మందు పంపిణీ నిలిపివేయడంతో ఆనందయ్య కోసం వస్తున్న వారికి పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. ఈ నెల 21 నుంచి ఆనందయ్య ఔషధం పంపిణీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కృష్ణపట్నంలో 144 సెక్షన్ కొనసాగుతున్నది. ఔషధంపై సోమవారం నివేదిక రానుండగా.. అప్పటి వరకు రహస్య ప్రాంతంలోనే ఉంచనున్నట్లు తెలుస్తోంది.
నెల్లూరు, ముత్తుకూరు నుంచి కృష్ణపట్నం వచ్చే రహదారుల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని కృష్ణపట్నంలోకి పోలీసులు అనుమతించడం లేదు. ఇదిలా ఉంటే.. విజయవాడ పరిశోధన కేంద్రం ఆనందయ్య మందుపై సీసీఆర్‌ఏఎస్‌కు సానుకూలంగా నివేదిక పంపినట్లు తెలుస్తోంది. ఆనందయ్య మందు స్వీకరించిన వారికి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదంటూ నివేదిక పంపారని సమాచారం.