ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కొనకళ్ళ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ చైర్మన్ గా కొనకళ్ళ నారాయణరావు ఆర్టీసీ హౌస్ లో అధికారుల సమక్షంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు

By Medi Samrat  Published on  5 Oct 2024 8:45 PM IST
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కొనకళ్ళ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ చైర్మన్ గా కొనకళ్ళ నారాయణరావు ఆర్టీసీ హౌస్ లో అధికారుల సమక్షంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలను సురక్షితంగా, సౌలభ్యంగా గమ్యాలకు చేర్చే సాధనం ఏపీఎస్ఆర్టీసీ అని అన్నారు. ఆర్టీసీకి నష్టం వచ్చినా, ప్రజలపై టికెట్ భారం వేయకుండా ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు.. పేదవారికి, మధ్య తరగతి వారికి ఆర్టీసీని అందుబాటులో ఉంచుతూ సౌకర్యవంతంగా, సౌలభ్యంగా ప్రయాణించేలా అన్నిచర్యలు ఆర్టీసీ తీసుకుంటుందన్నారు. ఇతర సంస్థలతో పోల్చుకుంటే యాక్సిడెంట్లు లేకుండా 99 శాతం బస్సులను ప్రజలకు సౌకర్యవంతంగా నడుపుతూ, ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా వెంటనే దాన్ని సరిచేసుకుని ప్రజలకు సేవలు అందించటంలో ఆర్టీసీ ముందుందన్నారు. ఆర్టీసీలో కార్గోను కూడా అభివృద్ధి చేస్తామన్నారు.

కేంద్రం సాయంతో ఎలక్ట్రానిక్ బస్సులను కొనుగోలు చేస్తామన్నారు. చార్జింగ్ సౌకర్యాల కోసం అనేక చోట్ల చార్జింగ్ యూనిట్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్టీసీని అన్ని విధాలుగా అభివృద్ది చేసి ఆదాయం పెంచుతామన్నారు. ఎలక్ట్రానిక్ భస్సులను ప్రవేశపెట్లడం వల్ల ఆర్టీసీలో చాలా వరకు ఖర్చును తగ్గించ వచ్చన్నారు. ఆర్టీసీకి ప్రయాణికులు ఎంత ముఖ్యమో, సంస్థలో పనిచేసే కార్మికులు శ్రేయస్సు కూడా అంతే ముఖ్యమన్నారు. ఆర్టీసీ లో కార్మిక సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా చాలా సంవత్సరాలుగా ఉన్నానన్నారు. కార్మికుల, ఉద్యోగుల సమస్యలు అన్నీ నాకు తెలుసన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ కలవక ముందు ఉద్యోగులకు ఆరోగ్యం విషయంలో ఆర్టీసీ పూర్తిగా బాధ్యత తీసుకుని వైద్యం చేయించేదని.. ప్రభుత్వంలో కలిశాక వారికి ఆరోగ్యం కల్పించే విషయంలో ఉద్యోగులకు అనేక సమస్యలు ఉన్నాయని, అధికారులతో అధ్యయనం చేసిన తరువాత వాటిపై దృష్టి పెట్టి న్యాయం చేస్తానన్నారు..

సంస్థ నడవటానికి కార్మికుల, ప్రయాణికుల శ్రేయస్సు ముఖ్యమన్నారు. భవిష్యత్ లో ఆర్టీసీని ఆర్థికంగా భలోపేతం చేస్తామన్నారు. ప్రయాణించే ప్రయాణికులకు గాని సంస్థలో పనిచేసే కార్మికులకు గాని తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాపైన గురుతరమైన పెద్ద బాధ్యతను అప్పజెప్పారని, దాన్ని తప్పకుండా నెరువేరుస్తానన్నారు. రాజకీయంగా ముఖ్యమంత్రి ఒకరోజు ఆలస్యమైనా నమ్మిన వారికి న్యాయం చేస్తారనన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు.

Next Story