Anakapalli: సముద్రంలోకి మనిషిని లాక్కెళ్లిన చేప
చేప కోసం వల వేసిన మత్స్యకారుడిని.. ఆ చేపే సముద్రంలోకి లాగేసింది. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసింది.
By అంజి
Anakapalli: సముద్రంలోకి మనిషిని లాక్కెళ్లిన చేప
చేప కోసం వల వేసిన మత్స్యకారుడిని.. ఆ చేపే సముద్రంలోకి లాగేసింది. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసింది. వలకి చిక్కిన కొమ్ము కోనాం చేపని లాగుతుండగా.. ఆ చేపే బలంగా మత్స్యకారుడైన యర్రయ్యను సముద్రంలోకి లాగేసిందని ప్రత్యక్ష సాక్షి యల్లాజీ చెప్పారు. జులై 2వ తేదీ ఉదయం వేటకు వెళ్లిన చోడుపిల్లి యర్రయ్య పూడిమడక తీరానికి 25 కిలోమీటర్ల దూరంలో గల్లంతయ్యాడు. ఆయన కోసం పూడిమడక తీరంలో కోస్ట్ గార్డ్ హెలికాప్టర్‌తో సెర్చ్ ఆపరేషన్ సాగుతోంది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ బుధవారం నాడు ఉదయం 9 గంటలకు వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకి కొమ్ము కోనాం చేపం చిక్కింది. దానిని లాగేందుకు వల బలం సరిపోకపోవడంతో.. వెంటనే యర్రయ్య మరో గేలం వేసి కొమ్ము కోనాం చేపని లాగే ప్రయత్నం చేశాడు.. అయితే ఆ చేపే బలంగా యర్రయ్యని లోపలికి లాగేసింది. ఇప్పటి వరకు యర్రయ్య ఆచూకీ దొరకలేదు. "యర్రయ్య కోసం కోస్ట్ గార్డ్ సెర్చ్ ఆపరేషన్ చేస్తోంది. ఇప్పటికైతే ఇంకా ఆచూకీ దొరకలేదు" అని పూడిమడక మెరైన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి.పైడిరాజు తెలిపారు.
పూడిమడక తీరంలోని మత్స్యకారులు యర్రయ్య ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కొందరు తీరం పొడవునా పడవలపై తిరుగుతూ వెతుకుతుంటే.. మరికొందరు ఎక్కడైతే యర్రయ్య గల్లంతయ్యాడో అక్కడికి వెళ్లి వెతుకుతున్నారు. అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామానికి చెందిన చోడుపిల్లి యర్రయ్య, చోడుపిల్లి కొర్లయ్య, వాసుపల్లి యల్లాజి, గనగళ్ల అప్పలరాజు బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు వేటకు బయలుదేరారు. వీరిలో యర్రయ్య, కొర్లయ్య అన్నదమ్ములు.