రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో కొమ్మినేనికి రిమాండ్
యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
By Knakam Karthik
రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో కొమ్మినేనికి రిమాండ్
అమరావతి రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అరెస్టయిన కేసులో ఓ ఛానల్ న్యూస్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టు నేడు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం రోజు కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనను ఇవాళ గుంటూరు జిల్లా మంగళగిరిలోని కోర్టు ముందు హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఉత్తర్వుల అనంతరం కొమ్మినేని శ్రీనివాసరావును తదుపరి చర్యల నిమిత్తం గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.
జూన్ 9న హైదరాబాద్‌లోని జర్నలిస్టు కాలనీలోని తన నివాసంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో కొమ్మినేని తో పాటు మరో జర్నలిస్టు వాడపల్లి కృష్ణంరాజు కూడా నిందితుడిగా ఉన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో రాజధాని రైతులు, మహిళల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. సాక్షి టీవీలో కొమ్మినేని నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కృష్ణంరాజు అమరావతి మహిళలను "వేశ్యల రాజధాని"గా అభివర్ణిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని, కొమ్మినేని ఆ వ్యాఖ్యలను సమర్థించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, ఐటీ చట్టం కింద నాన్-బెయిలబుల్ సెక్షన్లలో కొమ్మినేని శ్రీనివాసరావు , కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యం పై కేసులు నమోదయ్యాయి. సోమవారం ఉదయం అరెస్టు చేసిన పోలీసులు కొమ్మినేనిని హైదరాబాద్ నుంచి విజయవాడకు, ఆ తర్వాత గుంటూరు రూరల్ నల్లపాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ రోజు ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మంగళగిరి కోర్టులో ఆయనను హాజరుపరిచారు. దీంతో కోర్టు కొమ్మినేని శ్రీనివాస్ రావుకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.