చంద్రబాబు ఉచ్చులో పడొద్దు పవన్ కళ్యాణ్ : కొడాలి నాని

Kodali Nani On Bheemla Nayak Tickets Issue. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 'భీమ్లా నాయక్' సినిమా టికెట్ల వ్యవహారంపై పెద్ద చర్చ జరుగుతూ ఉంది.

By Medi Samrat  Published on  27 Feb 2022 12:14 PM IST
చంద్రబాబు ఉచ్చులో పడొద్దు పవన్ కళ్యాణ్ : కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 'భీమ్లా నాయక్' సినిమా టికెట్ల వ్యవహారంపై పెద్ద చర్చ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు వెనుక ఉన్న వ్యక్తులు చెబితే పవన్ కళ్యాణ్ తన సినిమాను ముందుకు తీసుకుని వచ్చారని కొడాలి నాని విమర్శలు చేశారు. గుంటనక్కల మాటలు పవన్ కళ్యాణ్ నమ్మకూడదని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆప్తుడైన నాగార్జున సినిమా 'బంగార్రాజు' కు ఎలాంటి నిబంధనలు ఉన్నాయో.. భీమ్లా నాయక్ సినిమాకు కూడా అవే నిబంధనలు ఉన్నాయని అన్నారు. తమకు అందరూ ఒక్కటేనని అన్నారు. చిరంజీవితో దండాలు పెట్టించుకున్నారని పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారని.. కొద్దిరోజుల కిందట వైఎస్ జగన్ సతీసమేతంగా భోజనానికి చిరంజీవి దంపతులతో భోజనం చేసిన విషయాన్ని పవన్ మర్చిపోయారా అని ప్రశ్నించారు కొడాలి నాని.

క్యాంపు ఆఫీసులోకి ముఖ్యమంత్రి కూడా నడుచుకుంటూ వస్తారని.. సెక్యూరిటీ చెక్ తర్వాతనే లోనికి పంపుతారని అన్నారు. చిరంజీవి తన ఇంట్లో పని చేసే వారిని, ప్రొడక్షన్ బాయ్స్ ను కూడా గౌరవంగా చూసుకునే వ్యక్తి అని.. ఎవరి దగ్గర కూడా ఆయన ఆ రకంగానే ఉంటారని కొడాలి నాని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి లాంటి ప్లేస్ లో ఉన్నారని నమస్కారం పెడితే.. కొందరు రాజకీయంగా విమర్శించారని, చిరంజీవికి అవమానం జరిగిందంటూ చెప్పి ఆయన అభిమానుల ఓట్లను కాజేయాలనే కుట్రకు కొందరు పాల్పడ్డారని అన్నారు. చిరంజీవి ప్రతి ఒక్కరితో కలిసిపోయే వ్యక్తి అనే విషయం పవన్ కళ్యాణ్ కు తెలియదా అని ప్రశ్నించారు కొడాలి నాని.

ఈ రాష్ట్రంలో ఉన్న ఎల్లో బ్యాచ్, 420ల ఉచ్చులో పవన్ కళ్యాణ్ పడొద్దని కోరుతున్నానని అన్నారు. ఎవరి సినిమాకైనా ఒకటే రూల్స్ అని.. ప్రభుత్వం నిర్ణయించే ధరలకే టికెట్లు అమ్మాలని, ప్రజలను మోసం చేయడాన్ని ఉపేక్షించమని అన్నారు. మిత్రుడా, శత్రువా అనే తారతమ్యాలు తమకు లేవని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిన హీరోలను తొక్కేయాలని చూశారని విమర్శించారు. ఇదే సమయంలో సీపీఐ నారాయణపై కూడా విమర్శలు చేశారు కొడాలి నాని.


Next Story