మరోసారి కియా భారీ సాయం
KIA Donate 10 lakh Masks To AP Govt. కరోనా మహమ్మారితో పోరాడడానికి ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి.
By Medi Samrat Published on 6 July 2021 2:11 PM ISTకరోనా మహమ్మారితో పోరాడడానికి ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అందుకు పలు సంస్థలు కూడా తమ మద్దతును ఇస్తూ ఉన్నాయి. పలు పారిశ్రామిక దిగ్గజాలు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఆర్ధిక సాయం అందించాయి. కియా సంస్థ కూడా తన వంతు సహాయాన్ని అందిస్తూ వస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కియా ఇండియా పది లక్షల మాస్క్ లను అందించింది. దీనికి సంబందించిన పత్రాన్ని, శ్యాంపిల్ మాస్క్ లను సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల శాఖ కార్యాలయంలో కమిషనర్ కె. కన్నబాబుకు కియా ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫిసర్ కబ్ డాంగ్ లీ అందించారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీ (సిఎస్సార్) క్రింద మాస్క్ లను అందించిన కియా ఇండియా ప్రతినిధులను కమిషనర్ కన్నబాబు అభినందించారు.
ఈ మాస్క్‌లను అన్ని జిల్లాలకు పంపించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కియా ఇండియా లీగల్ & కార్పోరేట్ హెడ్ జూడ్ లీ , ప్రిన్సిపల్ అడ్వైజర్ డాక్టర్ సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోడంలో ప్రభుత్వంతో పారిశ్రామికవేత్తలు, పెద్ద వ్యాపారులు, ఆర్ధిక స్థోమత ఉన్న కార్పొరేట్ సంస్థ నిర్వాహకులు భాగస్వాములు కావాలని విపత్తుల శాఖ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
కొవిడ్ నివారణ, సహాయ చర్యల కోసం కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మే నెలలో 5 కోట్ల విరాళం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థకు ఈ భారీ విరాళం ఇచ్చింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసి రూ. 5 కోట్లు ఎన్ఈఎఫ్‌టీ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసిన పత్రాలను కియా ప్రతినిధులు అందజేశారు.