ఇండియా కూట‌మి చైర్‌ప‌ర్స‌న్‌గా ఖర్గే..!

లోక్‌సభ ఎన్నికల కోసం విపక్షాలు వేగంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. సీట్ల పంపకాల ఎజెండాపై ఇవాళ ఇండీయా కూటమి పార్టీలు సమావేశం అయ్యాయి.

By Medi Samrat  Published on  13 Jan 2024 4:00 PM IST
ఇండియా కూట‌మి చైర్‌ప‌ర్స‌న్‌గా ఖర్గే..!

లోక్‌సభ ఎన్నికల కోసం విపక్షాలు వేగంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. సీట్ల పంపకాల ఎజెండాపై ఇవాళ ఇండీయా కూటమి పార్టీలు సమావేశం అయ్యాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేను ఇండియా కూటమికి చైర్‌ప‌ర్స‌న్‌గా ఎన్నుకునేందుకు ఆమోదం లభించింది. భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనడంతోపాటు కూటమికి సంబంధించిన ఇతర విషయాలను నేతలు ఈ స‌మావేశంలో చర్చించారు.

ఈ సమావేశంలో ఇండియా కూట‌మికి కన్వీనర్‌గా బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్ పేరును ప్రతిపాదించగా ఆయన తిరస్కరించారు. అన్ని పార్టీలు ఏకీభ‌విస్తేనే తాను క‌న్వీన‌ర్‌గా ఉంటాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేసిన‌ట్లు నివేదిక‌లు చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విపక్ష కూటమి చైర్‌ప‌ర్స‌న్‌గా నియమితులైనట్లు వార్తా సంస్థ పీటీఐ వర్గాలు తెలిపాయి.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, పార్టీ అధినేత్రి కనిమొళి కరుణానిధి చెన్నై నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు.

అంతకుముందు సీట్ల పంపకాలపై శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మధ్య సమావేశం జరిగింది. మూలాల ప్రకారం.. ముకుల్ వాస్నిక్ ఇంట్లో జరిగిన ఈ సమావేశం సుమారు రెండు గంటల పాటు కొనసాగింది. రెండు పార్టీల నాయకులు ఈ సమావేశాన్ని సానుకూల దశగా పేర్కొన్నారు.

మణిపూర్‌లో జనవరి 14 నుంచి ప్రారంభమయ్యే భారత్ జోడో న్యాయ్ యాత్రలో కూటమి పార్టీల భాగస్వామ్యంపై కూడా సమావేశంలో చర్చించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ చెప్పారు.

Next Story