ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణలో కీలక సంస్కరణ
అమరావతి: రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik
ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణలో కీలక సంస్కరణ
అమరావతి: రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణలో కీలక సంస్కరణ చేపట్టారు. ప్రత్యక్ష ఉద్యోగ నియామకాల్లో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణకు అనుసరిస్తోన్న విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేసింది. పరీక్షార్థుల సంఖ్య 25 వేలు మించినప్పుడల్లా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించే విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఖాళీల సంఖ్య కంటే అభ్యర్థుల సంఖ్య 200 రెట్లు మించినప్పుడే ఇకపై స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.
కాగా దీనికి సంబంధించి ఏపీపీఎస్సీ ప్రతిపాదనలను ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో మెజారిటీ ఉద్యోగ నియామకాల్లో ఏక పరీక్ష విధానం అమల్లోకి రానుంది. ఉద్యోగాల నియామక ప్రక్రియ వేగంగా చేపట్టేందుకు ఏపీపీఎస్సీకి వెసులుబాటు కలగనుంది. ప్రతి ఉద్యోగానికి ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు పరీక్షలు రాయాల్సిన అవసరం లేకుండా ఏపీపీఎస్సీ నియామకాలు చేపట్టనుంది. తక్కువ సమయంలో ఎక్కువ ఉద్యోగ నియామకాలు చేసే అవకాశం ఉందని ఏపీపీఎస్సీ భావిస్తుండగా, నూతన విధానంతో నిరుద్యోగులకు కష్టాలు తప్పడంతో పాటు పలు ప్రయోజనాలు కలుగుతాయని భావిస్తోంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.