అమరావతి: గ్రామ సచివాలయాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే ఆవాస ప్రాంతాలను వాటి సమీప సచివాలయాల్లో చేర్చనుంది. జనాభా ప్రాతిపదికన సిబ్బందిని నియమించనుంది. ఈ మేరకు సచివాలయాల శాఖ పంపిన ప్రతిపాదనను ఆమోదించింది. ఇక సచివాలయాలన్నింటినీ నాలెడ్జ్ హబ్‌లుగా మార్చాలని సర్కారు నిర్ణయించింది. కృత్రిమ మేధ సాయంత్రో ప్రజల్ని ఎంఎస్‌ఎంఈ పారిశ్రామికవేత్తలుగా చేసే దిశగా శిక్షణ అందించనుంది. గ్రామ , వార్డు సచివాలయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
జనాభా ఆధారంగా ఉద్యోగుల కేటాయింపులు చేపడుతూ సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించింది. దీని ద్వారా సమానమైన పనితో సచివాలయ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. సచివాలయాలను జనాభా ఆధారంగా A, B, C కేటగిరీలుగా విభజించగా.. A కేటగిరీ సచివాలయాల్లో ఆరుగురు ఉద్యోగులు పనిచేయనున్నారు. B కేటగిరీ సచివాలయాలు ఏడు మంది సిబ్బంది నియమించబడతారు. C కేటగిరీ సచివాలయాలు.. ఎనిమిది మంది సిబ్బంది సేవలు అందించనున్నారు. ఈ విభజన ప్రధానంగా జనాభా గణాంకాలు, ప్రస్తుత వర్క్ లోడ్ ఆధారంగా రూపొందించబడింది.