ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు శుభవార్త. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వైఎస్సార్ చేయూత పథకం డబ్బులను ప్రభుత్వం ఈ నెల 16వ తేదీ నుంచి 10 రోజుల పాటు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక గ్రామ సమావేశాలు ఏర్పాటు చేసి.. లబ్ధిదారులకు పథకంపై అవగాహన కల్పించనున్నారు. ఈ పథకం కింద లబ్ధిపొందిన వారి విజయవంతమైన జీవనోపాధులను ఇతరులకు తెలియజేయనున్నారు. 17 నుంచి 25 వరకు మండల కేంద్రాల్లో చేయూత చెక్కులు లబ్ధిదారులకు అందిస్తారు. ఈ పథకం నిధులు గత సంవత్సరం విడుదల కావాల్సి ఉంది.
అయితే పలు కారణాల వల్ల నిధులు విడుదల కాలేదు. కానీ ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో పథకం అమలుకు మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళకు ఏడాదికి 18,750 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారు. ఆదాయపన్ను పరిధిలోకి రాని, మూడు ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్టభూమికి మించని వారు ఈ పథకానికి అర్హులు. కాగా ప్రభుత్వం 4వ ఏడాది నిధులను ఈ నెలలోనే లబ్ధిదారులకు అందించనుంది. వైఎస్సార్ చేయూత కింద 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1.50 లక్షల మందికి రూ.250 కోట్ల వరకు ఆర్థిక ప్రయోజనం లభించనుంది.