ఎమోషనల్ అయిన మాజీ సీఎం కేసీఆర్

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నివాళులు అర్పించారు

By Medi Samrat  Published on  23 Feb 2024 2:10 PM IST
ఎమోషనల్ అయిన మాజీ సీఎం కేసీఆర్

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నివాళులు అర్పించారు. కార్ఖానాలోని లాస్య నందిత నివాసానికి చేరుకున్న ఆయన ఆమె భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం లాస్య నందిత తల్లి, మాజీ ఎమ్మెల్యే సాయన్న సతీమణిని, ఇతర కుటుంబసభ్యులను కేసీఆర్‌ పరామర్శించారు.లాస్య నందిత మరణవార్త తెలియగానే కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆమె మృతికి సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. అతిపిన్న వయస్సులో ఎమ్మెల్యేగా నందిత ప్రజల మన్ననలు పొందారని చెప్పారు. కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారం క్రితమే లాస్యను పరామర్శించానని, ఇప్పుడు ఆమె లేకపోవడం విషాదకరమని వ్యాఖ్యానించారు. మంచి నాయకురాలిగా ఎదుగుతున్న లాస్య నందిత చనిపోయిందనే వార్తను ఉదయం లేవగానే తెలిసిందని అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడ్డ ఆమెను కేటీఆర్ స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. లాస్య నందిత పార్థివదేహానికి బీఆర్‌ఎస్‌ నేతలు నివాళులర్పించారు. కార్ఖానాలో లాస్య నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత, ఎంపీ కేకే, మాజీ మంత్రులు హరీశ్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నివాళులు అర్పించారు.

లాస్య నందిత అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. లాస్య నందిత మృతి బాధాకరమని మంత్రి చెప్పారు.

Next Story