'వీధి రౌడీలా మాట్లాడతారా?'.. పవన్‌పై నిప్పులు చెరిగిన ముద్రగడ
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఘాటుగా లేఖ రాశారు. లేఖలో ముద్రగడ ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు
By అంజి Published on 20 Jun 2023 12:07 PM IST'వీధి రౌడీలా మాట్లాడతారా?'.. పవన్‌పై నిప్పులు చెరిగిన ముద్రగడ
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఘాటుగా లేఖ రాశారు. లేఖలో ముద్రగడ ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. నిజాన్ని నిర్భయంగా రాయలనిపించే ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు. తాను కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయలేదని, యువతను వాడుకుని భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవట్లేదని అన్నారు. తాను కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి ఉద్యమం చేయలేదని.. తనకంటే చాలా బలవంతులైన మీరు తాను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి యువతకు రిజర్వేషన్ ఫలాలు ఎందుకు తీసుకురాలేదో చెప్పాలి? అని ప్రశ్నించారు.
తాను కాపు ఉద్యమంతో ఓటమికి దగ్గర అయ్యానని, దీన్ని బట్టి తాను కులాన్ని వాడుకున్నానో లేదో ఇప్పటికైనా తెలుసుకోవాలన్నారు. పార్టీ పెట్టిన తర్వాత 10 మందితో ప్రేమించబడాలి తప్ప, వీధి రౌడీ భాషలో మాట్లాడటం ఎంతవరకు న్యాయం? అంటూ ముద్రగడ ప్రశ్నించారు. రాజకీయాలలో అతి సామాన్యుడు తాలూకు ఇంటికి వెళ్లి ఓట్లు అడుక్కోవాలన్నారు. మీరు మాట్లాడే భాష వల్ల నష్టం తప్ప లాభం లేదన్నారు. పవన్.. మీ ప్రసంగాల్లో పదే పదే తొక్క తీస్తా, నార తీస్తా, కింద కూర్చోబెడతా, చెప్పుతో కొడతా, గుండు గీయిస్తా అంటున్నారని, ఇప్పటి వరకు ఎంత మందిని చెప్పుతో కొట్టారో గుండ్లు గీయించారో సెలవు ఇవ్వాలి అంటూ ఎద్దేవా చేశారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబం తప్పుడు మార్గాల్లో సంపాదిస్తుంది అని మాట్లాడడం తప్పు అని ముద్రగడ అన్నారు.
కాపుల ఉద్యమానికి సహాయం చేసిన వారిని విమర్శించడం తప్పన్నారు. మీకు రాజకీయ సలహాలు ఎవరిస్తారో తనకు తెలియదు కానీ, మీరు మాట్లాడే భాష ఒక పార్టీ అధినేతగా మాట్లాడాల్సింది కాదని హితబోధ చేశారు. కాపు ఉద్యమానికి మీరెందుకు రాలేదు? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడి మీద పోటీ చేసి చిత్తుగా ఓడించండి సత్తా చూపడానికి ముందుకు రండి అని అన్నారు. తనను ముఖ్యమంత్రి చేయాలని పవన్ ఎలా అడుగుతారని కూడా ముద్రగడ ప్రశ్నించారు. 175 సీట్లకు పోటీ చేస్తే సీఎం చేయాలని అడగాలి తప్ప .. టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుంటానని చెబుతూ తనను సీఎం చేయమని ఎలా అడుగుతారంటూ ముద్రగడ తన లేఖలో ప్రశ్నించారు.