26 కేసుల్లో ప్రమేయం ఉన్న గజదొంగను కంకిపాడు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు గన్నవరం డీఎస్పీ జై సూర్య, సీసీఎస్ డీఎస్పీ మురళీకృష్ణ పర్యవేక్షణలో కంకిపాడు సీఐ కనకారావు, ఎస్ఐ సుధాకర్ వారి సిబ్బంది టీంలుగా ఏర్పడి గజదొంగను అరెస్ట్ చేసి.. సొమ్మును రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీఎస్ డీఎస్పిస్సీ మురళీకృష్ణ మాట్లాడుతూ.. లాక్డ్ హౌసెస్ మానిటరింగ్ సిస్టమ్ అందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ఇంటికి తాళం వేసినప్పుడు తప్పనిసరిగా కర్టెన్ వేసి తాళం కనపడకుండా క్లోజ్ చేయాలని.. దీనివల్ల 90 శాతం దొంగతనాలు అరికట్టవచ్చని పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన వ్యక్తి వద్ద నుంచి సుమారు రెండు లక్షల 14 వేల విలువచేసే వెండి, బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నామని గన్నవరం డీఎస్పీ జై సూర్య తెలిపారు.
కంకిపాడులో నివాసం ఉంటున్న ఈఓ శివ కుమార్ ఇంటిలో ఈ నెల 16 వ తేదీన చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదుమేరకు కంకిపాడు పోలీసులు దొంగతనాన్ని చేధించారు. ఈ కేసులో చెరుకుమల్లి విశ్వనాధ రఘురాం అలియాస్ కోటేశ్వరరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇతనిపై డెకాయిట్ షీట్ కూడా ఓపెన్ చేశారు పోలీసులు. ప్రజలు ఊరు వెళ్తుంటే పోలీసులకు సమాచారం ఇవ్వండని.. లాక్డ్ హౌసెస్ మోనిటరింగ్ సిస్టం(LHMS)ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. దొంగతనం కేసు చేధించిన సిబ్బందిని అధికారులు అభినందించారు.