చిరంజీవి అంశంపై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కామినేని

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటు చేసుకున్న వివాదంపై బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు స్పందించారు.

By -  Medi Samrat
Published on : 27 Sept 2025 5:23 PM IST

చిరంజీవి అంశంపై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కామినేని

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటు చేసుకున్న వివాదంపై బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖుడు చిరంజీవికి జరిగిన అవమానంపై తాను చేసిన వ్యాఖ్యలు అపార్థాలకు దారితీశాయని అంగీకరిస్తూ, వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తన వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని ఆయన సభను కోరారు. "సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు కారణమయ్యాయనే భావన కలిగింది. అందువల్ల ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి" అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును ఆయన అభ్యర్థించారు.

దీనికి డిప్యూటీ స్పీకర్ సానుకూలంగా స్పందించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడితో చర్చించి, సంబంధిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఇదే అంశంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడంతో వివాదం ముదిరింది. బాలకృష్ణ వ్యాఖ్యలతో చిరంజీవి అభిమానులు, వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయగా, టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ పరిణామాల నేపథ్యంలో, తన వ్యాఖ్యలు అనవసర వివాదానికి దారితీశాయని భావించిన కామినేని, వాటిని ఉపసంహరించుకున్నారు.

Next Story