శ్రీలంక జైలు నుంచి 52 రోజుల తర్వాత కాకినాడ మత్స్యకారుల విడుదల

శ్రీలంక జాఫ్నా జైల్లో నిర్బంధంలో ఉన్న నలుగురు కాకినాడ జాలర్లు స్వదేశానికి తిరుగు పయనం అయ్యారు.

By -  Knakam Karthik
Published on : 28 Sept 2025 2:37 PM IST

Andrapradesh, Kakinada, fishermen released, Sri Lanka

శ్రీలంక జైలు నుంచి 52 రోజుల తర్వాత కాకినాడ మత్స్యకారుల విడుదల

ఢిల్లీ: శ్రీలంక జాఫ్నా జైల్లో నిర్బంధంలో ఉన్న నలుగురు కాకినాడ జాలర్లు స్వదేశానికి తిరుగు పయనం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ భవన్ నుంచి జాలర్ల విడుదలకు తక్షణ చర్యలు చేపట్టడంతో ఈనెల 26న నలుగురు జాలర్లను శ్రీలంక కోస్ట్ గార్డ్ సిబ్బంది భారత్ కు అప్పగించారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ సమీపంలోని మండపం వద్ద శ్రీలంక కోస్ట్ గార్డు సిబ్బంది ఈ నలుగురిని భారత్ కోస్ట్ గార్డ్ కు అప్పగించారు. తమిళనాడులోని మండపం నుంచి నౌకలో బయలుదేరిన నలుగురు మత్స్యకారులు ఈనెల 30న కాకినాడకు చేరుకోనున్నారు.

2025 ఆగస్టు 3 తేదీన కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులు — కె. శ్రీను వెంకటేశ్వర్, కర్రినోకరాజ్ బొర్రియా, చందా నాగేశ్వరరావు, బ్రహ్మనందంలు పడవ కొనుగోలు చేయడానికి నాగపట్నంకు బయలుదేరారు. తిరిగి ప్రయాణించే సమయంలో నావిగేషన్ లోపం కారణంగా శ్రీలంక జలాల్లోకి కొట్టుకుపోయి, జాఫ్నా తీరం సమీపంలోకి చేరుకున్నారు. వారిని శ్రీలంక నౌకాకాదళం అదుపులోకి తీసుకొని, జాఫ్నా పోలీసులకు అప్పగించింది. 2025 ఆగస్టు 4వ తేదీ నుంచి ఈ నలుగురు మత్స్యకారులు ఏడు వారాలకు పైగా జాఫ్నా జైలులో ఉన్నారు.

52 రోజులుగా జాఫ్నా జైల్లో నిర్బంధంలో ఉన్న నలుగురిని స్వదేశానికి తిరిగి రప్పించే అంశంపై డిల్లీ లోని ఏపీ భవన్ అధికారులు జాఫ్నాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా నిరంతర సంప్రదింపులు చేశారు. డిల్లీ లోని కోస్ట్ గార్డ్ కార్యాలయం ద్వారా నలుగురు మత్స్యకారులను స్వదేశానికి రప్పించేలా ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ మంతనాలు జరిపారు. ఈ మేరకు ఈ నెల 26 తేదీన శ్రీలంక అధికారులు నలుగురు మత్స్యకారులను భారత్‌కు అప్పగించారు. ఏపీ ప్రభుత్వం తక్షణం స్పందించి సంప్రదింపులు చేయకపోతే ఈ నలుగురు మరో ఆరు నెలల పాటు జాఫ్నా జైల్లో గడపాల్సి వచ్చేదని అధికారులు చెప్తున్నారు.

Next Story