కేఏ పాల్.. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయకూడదని పోరాటం చేస్తూ వస్తున్నారు. ఇటీవలి కాలంలో పలు ప్రాంతాల్లో పర్యటనలు చేస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మద్దతు కూడగడుతూ ఉన్నారు. కానీ ఆయనను మనవాళ్లు హర్ట్ చేశారట..! ఇంతకూ ఆయన ఎందుకు హర్ట్ అయ్యారో తెలుసా..? తనను కలవకుండా స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నేతలు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కలవడమే..!
స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలకు అండగా నిలిచేందుకు తాను అమెరికా నుంచి ఢిల్లీ వచ్చానని వెల్లడించారు. ఢిల్లీ వచ్చిన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నేతలు తనను కలవకుండా, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కలిశారని కేఏ పాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తాను హైకోర్టులో మూడు వ్యాజ్యాలు దాఖలు చేసిన సంగతి కార్మిక సంఘం నేతలకు తెలియదా? అని ప్రశ్నించారు. కార్మిక సంఘం నేతలు గనుక తనను కలిసి చర్చిస్తే, తాను వారి తరఫున ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని కేఏ పాల్ ప్రకటించారు. కార్మికుల కోసం తాను అమెరికా నుంచి వస్తే వారు తనను కలవకపోవడం బాధాకరమని అన్నారు.