సీఐ కాలర్ పట్టుకున్న కేఏ పాల్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సోమవారం
By Medi Samrat
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సోమవారం విశాఖలో నిరవధిక దీక్ష చేపట్టారు. మంగళవారం రెండో రోజుకు చేరుకోవడంతో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి, అరెస్ట్ చేసి కేజీహెచ్‌కు తరలించారు. ఈ సమయంలో కేజీహెచ్ గేట్ వద్ద పోలీసులతో కేఏ పాల్ వాగ్వాదానికి దిగారు. వారితో దురుసుగా ప్రవర్తించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తనకు వైద్యం అవసరం లేదని అన్నారు. తనను అడ్డుకోబోయిన సీఐ కాలర్ పట్టుకున్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిలిపివేయాలంటూ ఆయన రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి 48 గంటల గడువు ఇచ్చారు. ఢిల్లీ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో సోమవారం నిరవధిక దీక్షకు దిగారు. తన అనుచరులతో కలిసి ఆశీల్‌మెట్ట సమీపంలోని ఫంక్షన్ హాలులో దీక్షకు దిగారు. ప్రయివేటీకరణ బిల్లు వచ్చే వరకు దీక్ష కొనసాగుతుందని తెలిపారు. అయితే నేడు పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు.కేఏ పాల్ చేస్తున్న దీక్షా శిబిరం నుంచి ఆయనను బలవంతంగా పోలీసులు తరలించారు. అంబులెన్స్ ఎక్కించి కేజీహెచ్‌కు తీసుకుపోయారు. అయితే ఆసుపత్రికి లోపలికి వెళ్లకుండా గేటు దగ్గరే కేఏ పాల్ పోలీసులతో గొడవకు దిగాడు. ఆరోగ్యంగా ఉన్న తనను ఎందుకు ఆసుపత్రికి తీసుకెళ్తున్నారని పోలీసులను ఆయన ప్రశ్నించారు. తనను చంపేందుకే ఇలా చేస్తున్నారంటూ ఆరోపించారు పాల్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో సత్వర న్యాయం కావాలంటూ.. ఆంధ్రప్రదేశ్‌లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.