ఏపీ అసెంబ్లీలో నిన్న జరిగిన పరిణామాలపై సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు తనను కలచివేశాయని జూ.ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రజా సమస్యలపై చర్చలు జరగాలన్నారు. సభలో వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణమని, అయితే ఆ విమర్శలు వ్యక్తిగతంగా కాకుండా ప్రజా సమస్యలపై ఉంటే బాగుండేదని ఎన్టీఆర్ అన్నారు. ఆడపడుచులను గౌరవించడం మన సంప్రదాయమని పేర్కొన్నారు.
మహిళలను దూషిస్తూ మాట్లాడితే అది అరాచక పాలనే అవుతుందని ఎన్టీఆర్ విమర్శలు చేశారు. కాగా శుక్రవారం నాడు అసెంబ్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు వాకౌట్ చేశారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారు. కాగా ఈ ఘటనపై సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. ఇకపై మీరు మారకపోతే, తాము మెడలు వంచి మారుస్తామంటూ బాలకృష్ణ హెచ్చరించారు.