నెలకు రూ.2.60 లక్షలుపైబడి జీతం.. గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ మంత్రి

రాష్ట్రంలోని మైనారిటీ యువతకు జర్మనీ దేశంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను కూటమి ప్రభుత్వం నేతృత్వంలో కల్పిస్తున్నట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ శుక్రవారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

By -  Medi Samrat
Published on : 24 Oct 2025 7:43 PM IST

నెలకు రూ.2.60 లక్షలుపైబడి జీతం.. గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ మంత్రి

రాష్ట్రంలోని మైనారిటీ యువతకు జర్మనీ దేశంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను కూటమి ప్రభుత్వం నేతృత్వంలో కల్పిస్తున్నట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ శుక్రవారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ ప్రభుత్వం, నైపుణ్యాభివృద్ధి సంస్థ( ఏపీ ఎస్ ఎస్ డి సి ), ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ( ఓ ఎం సి ఏ పి ), ఐ ఈ ఎస్ ల సహకారంతో, జర్మనీలో ఎలక్ట్రిషియన్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.రెండు సంవత్సరాల ఐటిఐ లేదా మూడు సంవత్సరాల ఎలక్ట్రిషియన్ ట్రేడ్ విద్యార్హతతో ఉత్తీర్ణత సాధించిన వారు జర్మనీ ఉద్యోగాలకు అర్హులన్నారు.వయో పరిమితి గరిష్టంగా 30 సంవత్సరాలు లోపు ఉన్నవారు,కనీసం రెండేళ్ల సంబంధిత ఎలక్ట్రిషియన్ పనులలో అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

నెలకు 2.60 లక్షలు పైబడిన జీతంతో ఉద్యోగాలు

జర్మనీ దేశంలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీగా జీతం ఉంటుందని మంత్రి ఫరూక్ తెలిపారు. నెలకు 2,600 నుండి 2,700 యూరోలు ( భారత కరెన్సీలో రూ. 2.60 లక్షల నుండి రూ.2.70 లక్షలు) జీతం పొందవచ్చునని అన్నారు.రెండేళ్ల ఒప్పందం మేరకు జర్మనీలో ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు ఉందని తెలిపారు.ఒప్పందం ప్రకారం అదనపు పనికి అదనపు జీతం, ఇతర సౌకర్యాలు లభిస్తాయని తెలిపారు.జర్మనీలో అవసరమయ్యే అక్కడి స్థానిక గుర్తింపు, అనువాద ఖర్చులను యజమాని భరిస్తారని, వసతి,రాక (ఆరైవల్) సహాయంను అక్కడ యజమాని అందిస్తారని తెలిపారు.జర్మనీలో 6 నెలల ప్రొబేషన్ కాలం పూర్తయిన తర్వాత 1000 యూరోలు తిరిగి చెల్లించడం జరుగుతుందన్నారు.

నవంబర్ నుండి జర్మనీ భాషపై శిక్షణ

జర్మనీలో ఉద్యోగాలు పొందేందుకు అర్హులకు జర్మనీ భాషపై పట్టు సాధించేందుకు వీలుగా ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టు మంత్రి ఫరూక్ తెలిపారు. దాదాపు 12 లేదా 14 వారాల పాటు జర్మన్ భాష లోని ఏ-1,ఏ-2 స్థాయిల వరకు క్లాస్ రూమ్ శిక్షణ ను తాత్కాలికంగా రాజమండ్రి లో ఏర్పాటు చేసి రోజుకి 8 గంటలపాటు ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇందుకు ఖర్చును అభ్యర్థులే భరాయించాల్సి ఉంటుందని వెల్లడించారు.దరఖాస్తు, శిక్షణ కోసం ఫీజు రూ.1.15 లక్షలు ను మూడు వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుందన్నారు.విమాన,వీసా తదితర ఛార్జీలు కూడా అభ్యర్థు లు స్వయంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. జర్మనీలో ఉద్యోగాల కోసం నవంబర్ 2వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. చెల్లుబాటు అయ్యే పాస్ పోర్టు, గతంలో పనిచేసిన కంపెనీల నుండి రిలీవింగ్ లెటర్,సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్లు సమర్పించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన మైనారిటీ అభ్యర్ధులందరూ వారి యొక్క బయోడేటా స్కిల్ ఇంటర్నేషనల్ ఏపీ ఎస్ ఎస్ డి సి. ఇన్ కు ఆన్లైన్ ద్వారా పంపించాలని మంత్రి కోరారు. మరిన్ని వివరాల కోసం, ఆసక్తి గల అభ్యర్థులు 9988853335, 8712655686, 8790118349, 8790117279 సెల్ నెంబర్లకు ఫోన్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని, అర్హులైన మైనారిటీ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.

Next Story