నన్ను కలవడానికి వస్తే బొకేలు..శాలువాలు తేవొద్దు: పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

By Srikanth Gundamalla  Published on  13 Jun 2024 8:45 PM IST
janasena, pawan kalyan, andhra pradesh,

నన్ను కలవడానికి వస్తే బొకేలు..శాలువాలు తేవొద్దు: పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వంలో మంత్రిగా కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనకు ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే.. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తనని కలిసేందుకు వస్తున్న వారికి పవన్ ఒక విజ్ఞప్తి చేశారు. అభినందనలు తెలిపేందుకు వచ్చే వారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావొద్దని కోరారు. ఈ మేరకు పవన్ కల్యాణ్‌ ఒక లేఖను విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి అభినందనలు.. శుభాకాంక్షలు అందుతూనే ఉన్నాయని పవన్ కల్యాణ్‌ చెప్పారు. ప్రజాజీవితంలో ఉన్న నాయకులు, మేధావులు, నిపుణులు, సినీరంగంలో ఉన్నవారు, యువత, రైతులు ఇలా అన్ని వర్గాల వారు అభినందనలు చెబుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెబుతున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు పవన్ కల్యాణ్‌. జనసేన నేతలు, కార్యకర్తలు తనని కలిసేందుకు ఆశిస్తున్నారని అన్నారు. ఈ క్రమంఓలనే వారిని జిల్లాల వారీగా కలిసి మాట్లాడుతానని చెప్పారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర కార్యాలయం ద్వారా తెలియజేస్తానని చెప్పారు పవన్ కల్యాణ్.

ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. అదే విధంగా శాసనసభ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. వీటిని పూర్తి చేసుకున్న తర్వాత అఖండ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కలుస్తానని పవన్ చెప్పారు. ఈ నెల 20వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో కార్యకర్తలను కలుస్తానని అన్నారు. ఆ తర్వాత దశల వారీగా గ్రామాల్లో పర్యటిస్తానని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చెప్పారు.

Next Story