పిఠాపురం నియోజకవర్గంలో పవన్ నివాసం అక్కడే..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ నివాసం అక్కడే..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. అయితే.. పిఠాపురంలో ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో తిరిగి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని కోరారు. తద్వారా రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. అంతేకాదు.. పిఠాపురం నియోజకవర్గం నుంచి తనని గెలిపిస్తే దేశంలోనే ఆదర్శవంతమైన నియోజవకర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 54 గ్రామాలు ఉన్నాయనీ.. ఇందులో ఏదో ఒక గ్రామంలోనే తానూ నివాసం ఉంటానని పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో నివాసంలో ఉండేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చేబ్రోలు బైపాస్ రోడ్డు పక్కన పంటపొలాల్లో నాగేశ్వరరావు అనే వ్యక్తి భవనాన్ని నిర్మించాడు. దీన్ని పవన్ నివాసం ఉండేందుకు ప్రాథమికంగా ఎంపిక చేశారు. పిఠాపురంలో తన సొంత ఇంటిని నిర్మించుకునే వరకు ఇక్కడే పవన్ నివాసం ఉంటారని జనసేన వర్గాలు చెబుతున్నారు. మూడు అంతస్తుల్లో భనవం ఉందనీ.. పార్టీ కార్యకలాపాలకు ఉపయోగకరంగా ఉంటుందని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక పిఠాపురంలో ఇటీవల పర్యటించిన పవన్ కల్యాణ్ కు తీవ్ర జ్వరం వచ్చింది. దాంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. ప్రచారాన్ని నిలుపుదల చేసి హైదరాబాద్‌కు వెళ్లారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ ఆరోగ్యం కుదుట పడుతోందనీ.. త్వరలోనే మళ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా జనసేన పార్టీ శుక్రవారం విడుదల చేసింది. ఈ నెల 7 వారాహి విజయభేరి యాత్రలో భాగంగా అనకాపల్లిలో పర్యటిస్తారని జనసేన పార్టీ తెలిపింది. అనకాపల్లిలో నిర్వహించనున్న సభలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. ఆ తర్వాత ఈ నెల 8న ఎలమంచిలి నియోజకవర్గంలో పర్యటిస్తారు. పిఠాపురం నియోజకవర్గంలో ఈ నెల 9న ఉగాది సందర్భంగా నిర్వహించే వేడుకల్లో పాల్గొంటారు.