జనసేనానికి తీవ్ర జ్వరం.. తెనాలి, ఉత్తరాంధ్ర పర్యటన వాయిదా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.
By Srikanth Gundamalla
జనసేనానికి తీవ్ర జ్వరం.. తెనాలి, ఉత్తరాంధ్ర పర్యటన వాయిదా
ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో అక్కడ రాజకీయ పార్టీలు చురుగ్గా ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేసుకున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఎలాగైనా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఉమ్మడిగా పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మూడు పార్టీల ముఖ్య నేతలు వరుసగా ర్యాలీలు, సభల్లో పాల్గొంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారాహి విజయ భేరి యాత్ర నిర్వహిస్తున్నారు.
కాగా.. ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. నిర్విరామంగా నాయకులు ప్రచారంలో పాల్గొంటుడంతో వారు అనారోగ్యానికి గురవుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా మొదట కాస్త జ్వరంగా ఉన్నా కూడా వారాహి విజయ భేరి యాత్ర కొనసాగించారు. ఇక రెండ్రోజులు గడిచాక ఎండ వేడిమికి పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఏప్రిల్ 2వ తేదీన ఏకంగా 20 కిలోమీటర్లు ఎండలో పాదయాత్రలో పాల్గొన్నారు. దాంతో.. వైద్యులు ఆయన్ని పరీక్షించి.. తీవ్ర జ్వరం ఉందని చెప్పారు. పవన్ కల్యాణ్‌కు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు.
వైద్యుల సూచనతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం పర్యటన రద్దు అయ్యింది. సాయంత్రం తెనాలిలో ర్యాలీ, సభలో పాల్గొనాల్సి ఉండగా వాటిని రద్దు చేసుకున్నారు. జ్వరం తగ్గిన వెంటనే తిరిగి వారాహి యాత్రలో పాల్గొననున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని షేర్ చేశారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారన్నారు. తెనాలితో పాటు ఉత్తరాంధ్ర పర్యటనను కూడా వాయిదా వేసినట్లు వెల్లడించారు. కనీసం రెండుమూడు రోజులు విశ్రాంతి అవసరం అని వైద్యులు చెప్పారని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇక పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించి రీషెడ్యూల్ చేసిన వెంటనే పునఃప్రారంభిస్తారని చెప్పారు. ఇక రీషెడ్యూల్ కార్యక్రమాలను కూడా త్వరలోనే ప్రకటించనున్నట్లు ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
#VarahiVijayaBheri :
— JanaSena Party (@JanaSenaParty) April 3, 2024
శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన వాయిదా
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ రోజు తెనాలిలో చేపట్టాల్సిన వారాహి విజయ భేరి కార్యక్రమంతోపాటు…