హామీలు నెరవేర్చమంటే వేధిస్తారా?: పవన్ కళ్యాణ్
ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla
హామీలు నెరవేర్చమంటే వేధిస్తారా?: పవన్ కళ్యాణ్
ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు చేపడుతున్న నిరవధిక సమ్మెకు పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్ల ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం గమనించాలని సూచించారు. ఇకనైనా మానవతా దృక్పథంతో స్పందించి వారి ఇబ్బందులను తీర్చాలని చెప్పారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయమంటే వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు పొరుగు రాష్ట్రాల కంటే రూ.1000 ఎక్కువగా ఇస్తామని విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ చెప్పారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని నెరవేస్తాడని వారంతా ఆశపడ్డారని అన్నారు. కానీ.. అధికారంలోకి వచ్చాక వెయ్యి రూపాయలు తక్కువగా వేతనం ఇస్తున్నారు.. దీన్ని ఏమనాలంటూ పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. దీన్నే మాట తప్పడం అంటారంటూ సీఎం జగన్‌ను ఎద్దేవా చేశారు. మాట తప్పడు అంటూ జగన్‌ను ఆ పార్టీ నేతలు మోసేస్తారంటూ.. కానీ మాట తప్పడంలో జగన్ ముందున్నారంటూ ఆరోపించారు. హామీల గురించి నిలదీస్తే వారిని వేధింపులకు గురి చేస్తున్నారనీ.. పాలకుల నైజాన్ని తెలియజేస్తోందని పవన్ విమర్శించారు. అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు బద్దలుకొట్టి పంచనామాలు చేస్తామని చిరుద్యోగులను బెదిరిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 52వేల అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని పవన్ చెప్పారు. వాటిల్లో లక్షకుపైగా మంది మహిళలు కార్యకర్తలుగా, హెల్పర్లుగా నామ మాత్రమపు వేతనానికే పనిచేస్తున్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు జగన్ చెప్పినట్లుగా వారి వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ విధానాన్ని వీరికి వర్తింపజేయాలన్నారు. ఈ చిరుద్యోగుల పట్ల మానవతాదృక్పథంతో స్పందించి వారికి అండగా నిలవాలని వైసీపీ ప్రభుత్వానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచించారు.