కోనసీమ క్రాప్ హాలీడే పాపం వైసీపీదే : పవన్ కళ్యాణ్
Janasena Party Chief Pawan Kalyan comments on Konaseema crop holiday. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వ
By తోట వంశీ కుమార్ Published on 10 Jun 2022 1:57 PM ISTజనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వ తీరుపై మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, నిర్లిప్తత వల్లే కోనసీమ రైతులు పంట విరామం తీసుకున్నారన్నారు. బంగారు పంటలు పండించే కోనసీమ రైతులు ఇప్పుడు 'క్రాప్ హాలిడే'ప్రకటించిన పాపం అంతా వైసీపీ ప్రభుత్వానిదేనని విమర్శించారు.
'వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, చేసిన తప్పిదాల వల్లే అన్నపూర్ణ వంటి కోనసీమలో ఈ రోజు క్రాప్ హాలీడే ప్రకటించే పరిస్థితి దాపురించింది. ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించరు. కాలువలు, డ్రెయిన్ల మరమ్మత్తులు, పూడిక తీత, గట్టు పటిష్టం వంటి పనులపై శ్రద్ధ చూపడం లేదు. రంగుమారిన ధాన్యానికి ధర ఇవ్వరు. ఇలాంటి ఇబ్బందులతోనే రైతాంగం పంట వేయకూడదని నిర్ణయం తీసుకుంది. దాదాపు 11 ఏళ్ల తరువాత మళ్లీ ఇలాంటి పరిస్థితులు దాపురించడం చాలా బాధాకరం. తొలకరి పంట వేయలేమని కోనసీమ రైతులు ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పంట విరామ నిర్ణయాన్ని తీసుకున్నారు.
అన్నం పెట్టే రైతు కోసమే ఏ ప్రభుత్వ పథకాలైన ఉంటాయి. అలాంటి అన్నదాతలే పంట పండించలేమని తేల్చి చెబుతున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్రాప్ హాలీడే ప్రకటించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. నాకు తెలిసి 2011లో ఒకసారి జరిగింది. దాదాపు లక్షన్నర ఎకరాల్లో పంట విరామం ప్రకటించారు. ఆనాడు గోదావరి జిల్లాల రైతుల నిర్ణయం దేశాన్ని కుదిపేసింది. దాదాపు 13 జాతీయ పార్టీల నేతలు కోనసీమకు తరలివచ్చి రైతాంగం సమస్యలు తెలుసుకున్నారు. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకూడదని కొన్ని మార్గనిర్ధేశకాలు చేశారు.
ఇప్పుడు 11 ఏళ్లు తరువాత మళ్లీ అలాంటి పరిస్థితే దాపురించింది. అల్లవరం, ఐ.పోలవరం, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం మండలాల్లో 25 వేల ఎకరాలు, అలాగే అమలాపురం రూరల్, మామిడికుదురు, కాట్రేనికోన, సఖినేటిపల్లి మండలాల్లో 20 వేల ఎకరాలు, కడియం మండలంలో కూడా కొన్ని వందల ఎకరాల్లో రైతులు పంట విరామం ప్రకటించారు. దాదాపు 50 వేల ఎకరాలకు పైగా పంట విరామం ప్రకటించడం చూస్తుంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతోంది.
రైతాంగం క్రాప్ హాలీడే ప్రకటించడానికి వైసీపీ చేసిన తప్పులే కారణం. రైతుల నుంచి రబీలో కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదు. దాదాపు రూ.475 కోట్ల బకాయిలు ఉన్నాయి. రైతులు పంట విరామం ప్రకటించడంతో రాత్రికి రాత్రి వారి ఖాతాల్లో రూ.139 కోట్లు జమ చేస్తున్నట్లు ప్రకటించారు. క్రాప్ హాలీడే ప్రకటించిన మండలాల్లోసాగు నీరు అందటంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. పంటకాలువలను, డ్రెయిన్లను ప్రభుత్వం మరమ్మతులు చేయడం లేదు. పూడికతీత, గట్టు పటిష్టం వంటి పనులపై శ్రద్ద చూపడం లేదు.
పంట విరామం ప్రకటించిన రైతులపై వైసీపీ నాయకులు విమర్శలు చేయడం చౌకబారుతనంగా ఉంది. ఇసుక లేదని భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కితే వాళ్లనూ ఇలానే తిట్టారు. ఇలా ఏ సమస్య వచ్చినా రాజకీయ కోణంలో చూడడం తప్ప.. సమస్యను పరిష్కరించే మనస్తత్వం లేదు. రైతు సోదరులకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు జనసేన అండగా నిలబడుతుంది. 'అని పవన్ కళ్యాణ్ అన్నారు.
కోనసీమ క్రాప్ హాలీడే పాపం వైసీపీదే - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/T1cXnjsb8u
— JanaSena Party (@JanaSenaParty) June 10, 2022