రాజమండ్రి ఎయిర్‌పోర్టులో జన సేనానికి ఘన స్వాగతం
JanaSena Chief Pawan Kalyan reached Rajahmundry Airport.
By తోట వంశీ కుమార్ Published on 20 Feb 2022 2:04 PM ISTజనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు(ఆదివారం) నరసాపురంలో పర్యటించనున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ఆ పార్టీ నేతలు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మత్స్యకార అభ్యున్నతి సభకు హాజరయ్యేందుకు జనసేన అధినేత రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి నరసాపురానికి పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో బయలు దేరారు. రావులపాలెం, సిద్దాంతం, పాలకొల్లు మీదుగా నరసాపురం చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం పవన్ కళ్యాణ్ నరసాపురం బయలు దేరి రాత్రి 8 గంటలకు రాజమహేంద్ర వరం చేరుకుంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
మత్స్యాకారుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ గత కొద్దిరోజులుగా జనసేన ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు జరగనున్న మత్స్యకార అభ్యున్నతి సభలో పవన్ ప్రసంగిస్తారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు హజరయ్యే అవకాశముంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే. ఇటీవలే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవలే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనపై అనర్హత వేటు కోసం ప్రయత్నిస్తున్నారని.. వాళ్లకు తానే సమయం ఇస్తున్నానని వైసీపీ అధిష్టానానికి సవాల్ విసిరారు. వారంలో నిర్ణయం చెప్పాలని.. తనపై అనర్హత వేటు వేయకపోతే తానే రాజీనామా చేస్తానని అన్నారు. తమ పార్టీ వాళ్లు రెండేళ్లగా ఎక్కిన గుమ్మం, దిగిన గుమ్మంతో బిజీగా ఉన్నారు. కుదిరితే స్పెషల్ ఫ్లైట్, కుదరకపోతే అందిన ఫ్లైట్‌లో తిరుగుతూ వరుసగా ఫిర్యాదులు ఇస్తున్నారు. త్వరలోనే అనర్హత వేటు వేస్తారని సొల్లు కబుర్లు చెబుతున్నారని.. తన పార్లమెంట్ సభ్యత్వం తీసేయాలని ప్రయత్నిస్తున్నారని.. అయితే వాళ్లు ఎంత వరకు విజయం సాధిస్తారో చూద్దామన్నారు. వారు ప్రయత్నాలు ఫలించకపోయినా.. తాను రాజీనామా చేసి.. ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని.. అంతేకాదు భారీ విజయం సాధిస్తున్నానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నర్సాపురం పవన్ పర్యటన ఆసక్తి పెంచుతోంది.