జనసేన ఆవిర్భావ దినోత్సవం.. మార్చి 14 బహిరంగ సభకు అనుమతి
Jana Sena formation day.. Permission granted for March 14 public meeting
By అంజి Published on 10 March 2022 12:44 PM ISTమార్చి 14న మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఇప్పతం గ్రామంలో జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బహిరంగ సభకు రంగం సిద్ధమైంది. మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య విజయవాడ నగర పోలీసులు ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు. వేదిక వద్ద కోవిడ్-19 నిబంధనలు పాటించేలా చూడాలని పోలీసులు పార్టీ నేతలను ఆదేశించారు. సభను విజయవంతం చేసేందుకు మొత్తం 12 కమిటీలను ఏర్పాటు చేశారు. నీతి, నిజాయితీలకు పేరుగాంచిన మాజీ ముఖ్యమంత్రి స్మారకార్థం సభా వేదికకు 'దామోదరం సంజీవయ్య చైతన్య వేదిక' అని పేరు పెట్టనున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఈ సమావేశానికి జిల్లా, మండల నాయకులు, ఇప్పతం గ్రామాల రైతులు హాజరుకానున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సభను విజయవంతం చేస్తామన్నారు. కాగా గత కొన్ని రోజులుగా వైసీపీ ప్రభుత్వంపై పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభకు సీఎం జగన్ ప్రభుత్వం లైన్ క్లియర్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ శాంతించారు.