తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడుతూ.. ప్రజల తీర్పును ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదన్నారు. సాధ్యం కానీ హామీలు ఇచ్చినా ప్రజలు వాటిని నమ్మారని అసహనం వ్యక్తం చేశారు. ధనుంజయ రెడ్డి లాంటి చెత్త అధికారులు జగన్ చుట్టూ చేరి చెడగొట్టారని.. ఎమ్మెల్యేలు జగన్ ని కలిసే పరిస్థితి ఉండేది కాదని ఫైర్ అయ్యారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానం కూడా మాకు ఉందని అన్నారు.
ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే నైజం చంద్రబాబుది కాదు. రాజకీయాలలో విలువలు పాటించే వ్యక్తి జగన్‌దని అన్నారు. జగన్ ఓడినా.. గెలిచిన ఆయన రియల్ హీరో.. జగన్ చుట్టూ ఉన్న పనికిమాలిన అధికారులు ఆయనను తప్పుదోవ పట్టించారని జక్కంపూడి రాజా ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరి శ్వాస వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే నడుస్తానని స్పష్టం చేశారు.
కుటుంబ సభ్యులకు కూడా సమయం ఇవ్వకుండా ప్రజల కోసం పనిచేశానని ఆవేదన వ్యక్తం చేశారు. ఏరోజు నా భార్యతో గాని నా పిల్లలతో గాని 10 నిమిషాలు కూర్చున్న పరిస్థితి లేదు. నా కాళ్లకు వ్యాధి ఉన్నా, నడవలేని స్థితిలో ఉన్నా నియోజకవర్గంలో ప్రతి గడపగడపకు కాలినడకన తిరిగాను. ప్రజలే జీవితం అనుకుని భ్రమలో ఇప్పటిదాకా బతికాను. నన్ను కన్నతల్లికి, అమ్మమ్మకి ఒంట్లో బాగోలేకపోయినా వారి దగ్గర ఉండలేకపోయాను. ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్పూర్తిగా తీసుకోలేకపోతున్నాను. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. కానీ ఈ రకమైన ఓటమిని చవిచూస్తామని అనుకోలేదన్నారు.