ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్ధమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న సీఎం జగన్.. 2022 ఫిబ్రవరి 28 సోమవారం నాడు మూడో విడత 'జగన్నన్న తోడు' రుణాలను జమ చేయనున్నారు. 5.10 లక్షల మందికి వడ్డీలేని రుణాలు రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాలు, మొదటి రెండు విడతల వడ్డీ రూ.16.16 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయబడతాయి. ఏపీ ప్రభుత్వం మొదటి విడతలో 5.35 లక్షల మందికి, రెండో విడతలో 3.70 లక్షల మందికి రుణాలు అందించింది. మూడో విడతతో కలిపి మొత్తం 14.16 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని అంచనా.
జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే సీఎం జగన్ సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో రుణాలను జమ చేస్తారు. ఉదయం 11 గంటలకు తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించి చిరు వ్యాపారులు, చేతివృత్తుల వారికి రుణాలు అందజేస్తారు. 2020 నవంబర్ 25న ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ఎటువంటి పూచీ లేకుండా ఒక్కో లబ్ధిదారునికి రూ.10,000 చొప్పున రుణాలను అందజేస్తుంది. రుణగ్రహీత 12 సులభమైన వాయిదాలలో రుణాన్ని తిరిగి చెల్లించాలి. వడ్డీని ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు చెల్లిస్తుంది.