ప్రమాదం కాదు.. నేనే కారును ఢీకొట్టా: మాధురి
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో కీలకంగా ఉన్న దివ్వెల మాధురి కారు ప్రమాదానికి గురైంది.
By అంజి Published on 11 Aug 2024 6:41 PM IST
ప్రమాదం కాదు.. నేనే కారును ఢీకొట్టా: మాధురి
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో కీలకంగా ఉన్న దివ్వెల మాధురి కారు ప్రమాదానికి గురైంది. పలాస మండలం లక్ష్మీపురం టోల్‌గేట్ వద్ద ఆగి ఉన్న కారును ఆమె నడుపుతున్న కారుతో ఢీకొట్టింది. ఈ ఘటనలో మాధురికి గాయాలయ్యాయి. టెక్కలి నుంచి పలాస వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
అయితే తనకు జరిగింది రోడ్డు ప్రమాదం కాదని, కావాలనే తాను మరో కారు ఢీకొట్టినట్టు మాధురి తెలిపారు. తనపై, తన పిల్లలపై ట్రోల్స్ తట్టుకోలేకపోతున్నానన్నారు. దువ్వాడ భార్య వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపారు. తనకు డాక్టర్లు ట్రీట్మెంట్ చేయ్యొద్దని తెలిపారు. దీంతో దువ్వాడ ఎపిసోడ్ కీలక మలుపు తిరిగింది. తాను ఆత్మహత్య చేసుకుంటానని నిన్న టీవీ డిబేట్‌లో మాధురి హెచ్చరించిన విషయం తెలిసిందే.
దివ్వెల మాధురి ప్రస్తుతం పలాస ప్రభుత్వాసుపత్రిలో ఉన్నారు. వైద్యులు ఆమెకు చికిత్స అందించేందుకు ప్రయత్నించగా, తొలుత నిరాకరించారు. ఆ తర్వాత నచ్చజెప్పడంతో చికిత్సకు సహకరించారు. ప్రస్తుతం మాధురి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత స్థానికులు, పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.