అమరావతి: ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రణాళికను సైతం అధికారులు సిద్ధం చేశారు. గత వారం రోజుల నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకుపైగా నమోదు అవుతున్నాయి. దీంతో మార్చి మొదటి వారం నుంచే ఒంటిపూట బడుల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు కోరుతున్నారు. మరి దీనిపై విద్యాశాఖ నుంచి ఎలాంటి రెస్పాండ్ వస్తుందో చూడాల్సి ఉంది.
అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒంటి పూట బడుల నిర్వహణపై త్వరలోనే నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం అందుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ కొన్ని రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 దాటగానే సూర్యుడు భగ భగ మండుతున్నాడు. మార్చి కూడా రాకుండానే ఎండల తీవ్రత ఓ రేంజ్‌లో పెరిగింది. ఈ క్రమంలోనే విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. కాస్త ముందుగానే ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.