సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో ఈ తెల్లవారుజామున జరిగిన గోడ కూలిన దుర్ఘటనలో విశాఖపట్నానికి చెందిన దంపతులు ప్రాణాలు కోల్పోయారు. వీరిని విశాఖపట్నంలోని మధురవాడ చంద్రంపాలెం గ్రామానికి చెందిన దంపతులు పిళ్లా ఉమామహేశ్వరరావు (30), శైలజ (26)గా నిర్ధరించారు. వీరు హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థల్లో విధులు నిర్వర్తిస్తూ.. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది. బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు దర్శన నిమిత్తం రూ.300 క్యూలైన్‌లో వేచిఉండగా గోడకూలిన ఘటనలో ఉమామహేశ్వరరావు, శైలజ మృతిచెందారు. ఉమామహేశ్ హెచ్‌సీఎల్‌లో, శైలజ ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నారు.
కాగా విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవ వేడుకల్లో గాలివాన కారణంగా గోడ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం అర్ధరాత్రి సింహాచలంలో భారీ వర్షం కురిసింది. వెంటనే స్పందించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్ కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.