మాజీ సీఐడీ చీఫ్ సంజయ్‌పై సస్పెన్షన్ వేటు
ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించినందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ N. సంజయ్‌ని సస్పెండ్ చేసింది.
By Medi Samrat Published on 4 Dec 2024 3:30 AM GMTప్రవర్తనా నియమాలను ఉల్లంఘించినందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ N. సంజయ్‌ని సస్పెండ్ చేసింది. ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్షణ & అప్పీల్) రూల్స్, 1969లోని రూల్ 3 (1) ప్రకారం.. మాజీ సీఐడీ చీఫ్‌ను సస్పెండ్ చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వు జారీ చేసింది.
1993 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సంజయ్.. రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తూ కొన్ని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రధాన కార్యాలయాన్ని వదిలి వెళ్లవద్దని ఐపీఎస్ అధికారిని ఆదేశించారు.
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌కు సంబంధించిన కేసుల దర్యాప్తును సిఐడి చీఫ్‌గా సంజయ్ పర్యవేక్షించారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ కేసులలో అరెస్టై దాదాపు రెండు నెలలు జైలు జీవితం గడిపారు.
టీడీపీ నేతృత్వంలోని ఎన్‌డిఎ విజయం సాధించడం.. జూన్‌లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంజయ్ బదిలీ చేయబడ్డారు.. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయవలసిందిగా ఉత్తర్వులలో కోరారు. కొత్త ప్రభుత్వం కూడా సంజయ్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని ఆదేశించింది.
కేటాయించిన పనిలో ఎలాంటి పురోగతి లేకుండా సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ. 1 కోటి చెల్లింపును సులభతరం చేయడానికి సంజయ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నివేదించింది. కంపెనీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, సెంట్రల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్ ప్రకారం సంజయ్‌పై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీంతో సంజయ్‌ను సస్పెండ్ చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వు జారీ చేసింది.